Share News

Telangana Rising Global Summit: గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సే

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:46 AM

ఈనెల 8వ తేదీ నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.....

Telangana Rising Global Summit: గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సే

  • రానున్న 20ఏళ్ల ప్రణాళికను ప్రకటించే వేదిక

  • ఇక్కడి విజయాన్ని దావోస్‌ అంతర్జాతీయ

  • సదస్సులో ప్రదర్శించాలి

  • సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఈనెల 8వ తేదీ నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్థి, అభివృద్థి ప్రణాళికలను ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌’ను ఆవిష్కరించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ మేరకు ప్రజాభవన్‌లో శుక్రవారం సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లు, వరుసగా రెండు రోజుల కార్యక్రమాల గురించి సీఎంకు అధికారులు వివరించారు. విజన్‌ డాక్యుమెంట్‌కు తుదిరూపు ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి పలు సూచనలు చేశారు. భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలను ప్రాధాన్యంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయాన్ని ప్రదర్శించాలనే తన ఆలోచనను సీఎం వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి శనివారం గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమ వివరాలను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా విమానాల రద్దు నేపథ్యంలో, హైదరాబాద్‌కు వచ్చే, వెళ్లే విమాన సౌకర్యాలపై ఎటువంటి ఇబ్బందులు రాకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Updated Date - Dec 06 , 2025 | 05:46 AM