Share News

Telangana Rising Global Summit: అన్నిదారులూ ఫ్యూచర్‌ సిటీ వైపే..

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:48 AM

నిన్నమొన్నటి వరకు రాళ్లురప్పలు, పొదలతో కనిపించిన మీర్‌ఖాన్‌పేటలోని భారత్‌ ప్యూచర్‌సిటీ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. విశాలమైన రహదారులు, రోడ్లకు ఇరువైపులా పచ్చదనం, ధగధగలాడే విద్యుద్దీపాలు, భారీ డిజిటల్‌ స్ర్కీన్లతో మరో ప్రపంచంలా కనిపిస్తోంది....

Telangana Rising Global Summit: అన్నిదారులూ ఫ్యూచర్‌ సిటీ వైపే..

  • అబ్బురపడేలా రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సు ఏర్పాట్లు.. ప్రాంగణంలో పనులకు తుది మెరుగులు

  • ఆకట్టుకునేలా ఆకృతులు.. భారీ స్థాయిలో స్ర్కీన్‌

  • అదిరిపోయే అతిథ్యం.. దేశ విదేశాల వంటకాలు

  • భారీ స్థాయిలో భద్రత.. డీజీపీ సమీక్ష

  • నేడు సదస్సు పనులను పరిశీలించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

నిన్నమొన్నటి వరకు రాళ్లురప్పలు, పొదలతో కనిపించిన మీర్‌ఖాన్‌పేటలోని భారత్‌ ప్యూచర్‌సిటీ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. విశాలమైన రహదారులు, రోడ్లకు ఇరువైపులా పచ్చదనం, ధగధగలాడే విద్యుద్దీపాలు, భారీ డిజిటల్‌ స్ర్కీన్లతో మరో ప్రపంచంలా కనిపిస్తోంది. అధికారులు, సిబ్బంది, వేలాది కార్మికులతో సందడి నెలకొంది. హైదరాబాద్‌ నగరం నుంచి ప్యూచర్‌ సిటీకి రోడ్డు అనుసంధానం పెంచే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 8, 9వ తేదీల్లో తలపెట్టిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సు పనులు తుదిదశకు చేరుకున్నాయి. టీజీఐఐసీ ఎండీ, ప్యూచర్‌ సిటీ ఎండీ శశాంక, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, మూసీ రివర్‌ ప్రాజెక్టు ఎండీ నర్సింహారెడ్డి నిత్యం ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాంగణాలను, ఎగ్జిబిషన్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రధాన ప్రాంగణంతోపాటు ఇతర ప్రాంగణాల్లో మొత్తం 5 నుంచి 6వేల మంది కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే అతిథుల కోసం హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ హోటళ్లలో సుమారు వెయ్యి గదులు బుక్‌ చేసినట్టు తెలిసింది. ఇక అతిథులను సదస్సు ప్రాంగణానికి తరలించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్తగా వినియోగంలోకి తెచ్చిన విద్యుత్‌ (ఈవీ) బస్సులను సిద్ధం చేస్తోంది. సదస్సును చూసేందుకు వచ్చే సాధారణ ప్రజల కోసం కూడా విద్యుత్‌ బస్సులను నడపనుంది. ఎంజీబీఎస్‌, సీబీఎ్‌సతో పాటు ఎంపిక చేసిన మొత్తం 10 ప్రాంతాల నుంచి వీటిని తిప్పనుంది.

అంతా డిజిటల్‌ మయం

సదస్సు జరిగే ప్రాంతమంతా డిజిటల్‌ మయంగా మారిపోయింది. సమావేశ ప్రాంగణాల లోపల, బయట భారీ డిజిటల్‌ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర ప్రముఖుల కోసం సదస్సు ప్రాంగణంలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలు, ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు, భేటీల కోసం సీఎం ఉండే లాంజ్‌ పక్కనే వీవీఐపీ లాంజ్‌ ఏర్పాటు చేశారు. సదస్సుకు వచ్చే ప్రముఖులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు గెట్‌ టుగెదర్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. ఇక సదస్సులో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణు ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అతిథుల కోసం అన్ని దేశాల వంటకాలను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్లకు బాధ్యతలు అప్పగించారు. కాగా, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి శుక్రవారం గ్లోబల్‌ సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించారు. అతిథులు, కంపెనీల ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.


6 వేల మందితో బందోబస్తు.. డీజీపీ సమీక్ష

సదస్సు కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరువేల మంది పోలీసులను మోహరించనున్నారు. శుక్రవారం భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు వస్తున్నందున 8, 9 తేదీల్లో డెలిగేట్లకు మాత్రమే సదస్సు ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని.. తర్వాత 4 రోజుల పాటు సాధారణ ప్రజలకు ప్రవేశ అవకాశం కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. మొత్తం మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. సదస్సు జరుగుతున్న ప్రాంతం, రాకపోకలు సాగించే మార్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

నేడు సీఎం రేవంత్‌ రాక!

గ్లోబల్‌ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఫ్యూచర్‌సిటీకి వెళ్లనున్నట్టు తెలిసింది. సదస్సుకు సంబంధించి సీఎం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. శనివారం ఉదయం లేదా సాయంత్రం స్వయంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Updated Date - Dec 06 , 2025 | 05:48 AM