Telangana Rising Global Summit concluded successfully: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం..మూడంచెల వ్యూహం
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:14 AM
భావితరాల కోసం రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా, సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ రైజింగ్- 2047 డాక్యుమెంట్’ను రూపొందించారు.....
భావితరాల కోసం రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా, సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా ‘తెలంగాణ రైజింగ్- 2047 డాక్యుమెంట్’ను రూపొందించారు. రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి, మూడు సూత్రాల ఆధారంగా, పది కీలక వ్యూహాలతో.. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు పొందుపరిచారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించటం ప్రధాన లక్ష్యం. ఈ డాక్యుమెంట్‌ను సీఎం మంగళవారం విడుదల చేశారు.2047 నాటికి సాధించాలనుకుంటున్న లక్ష్యాలను ఈ డాక్యుమెంట్‌లో రాష్ట్రప్రభుత్వం నిర్దేశించుకుంది. డాక్యుమెంట్ తయారీలో సీఎం రేవంత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, నిపుణుల సలహాలు తీసుకున్నారు.. 4 లక్షల మంది ఆకాంక్షలు, అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
లక్ష్యసాధనకు 3 మూల స్తంభాలు
1. ఆర్థిక అభివృద్ధి
2. సమ్మిళిత అభివృద్ధి
3. సుస్థిర అభివృద్ధి
3 వ్యూహాలు
ఆర్థిక అభివృద్ధి - ఆవిష్కరణలు, ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం. సమ్మిళిత అభివృద్ధి: యువత, మహిళలు, రైతులు, అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడటం.
సుస్థిర అభివృద్ధి: అన్ని రంగాలలో సుస్థిరతను తీసుకురావటం, 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం.
భావితరాల కోసం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్
3 ఉత్ర్పేరకాలు
1. సాంకేతికత... ఆవిష్కరణ: పాలన, పరిశ్రమలు, సేవలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.
2. సమర్థవంతమైన ఆర్థిక వనరులు: పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి వినూత్న ఆర్థిక నమూనాలను రూపొందించడం.
3. సుపరిపాలన: పారదర్శక, జవాబుదారీ, పౌర-కేంద్రీకృత పాలనను అందించడం.
మూడంచెల వ్యూహం
అభివృద్ధి ప్రామాణికంగా తెలంగాణను మూడు జోన్‌లుగా విభజించటం
1 కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్): 160 కి.మీ.ల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ప్రాంతం. సేవల విస్తరణకు ప్రాధాన్యం. నెట్-జీరో సిటీగా, ప్రపంచ స్థాయి నాలెడ్జ్ ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి.
2 పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్): ఓఆర్‌ఆర్‌కు,360 కి.మీ.ల పరిధి ఉన్న ప్రాంతీయ రింగ్ రోడ్‌కు మధ్య ఉన్న జోన్. తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌ల ఏర్పాటు.
3 రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్): ప్రాంతీయ రింగ్ రోడ్ దాటి, రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం. వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం.

10 కీలక వ్యూహాలు
ఈ లక్ష్యాలను సాధించడానికి 10 కీలక వ్యూహాలను డాక్యుమెంట్‌లో పొందుపరిచారు.
1. మూడు జోన్లుగా రాష్ట్రం: అభివృద్ధికి నమూనా.
2. విచక్షణ నుండి విధానానికి: పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం.
3. గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు: భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజినల్ రింగ్ రోడ్, రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్లు తదితర ప్రాజెక్టులు.
4. సమర్థ పాలన: డిజిటల్ గవర్నమెంట్ వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం.
5. నాలెడ్జ్ హబ్: ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన సంస్థలను ఆకర్షించడం.
6. సుస్థిర సంక్షేమం: మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, అందరికీ సమాన అవకాశాలు.
7. అభివృద్ధి నిధులు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం.
8. పర్యావరణం, సుస్థిరత: వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం.
9. సంస్కృతి: రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం.
10.ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజలతో: పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.

‘తెలంగాణ రైజింగ్-2047’ డాక్యుమెంట్‌లో నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) వంటి సేవారంగమే ఊతమివ్వనుంది. ఈ ఒక్క రంగం నుంచే 1.95 ట్రిలియన్ డాలర్ల స్థూల విలువ జోడింపు (జీవీఏ) ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. తర్వాతి స్థానంలో ఉన్న పారిశ్రామిక రంగం నుంచి 0.5 ట్రిలియన్ డాలర్ల జీవీఏ, వ్యవసాయ రంగం నుంచి 0.33 ట్రిలియన్ డాలర్ల జీవీఏ నమోదు కానుందని అంచనా. మిగతా 0.22 ట్రిలియన్ డాలర్లు పన్నులు, సబ్సిడీల నుంచి సమకూరనున్నాయని ప్రభుత్వం తన డాక్యుమెంట్‌లో వెల్లడించింది. సేవారంగంలో స్టార్ట్‌పలు, పరిశోధన సంస్థలకు ఊతమివ్వడం, ఫ్రాంటియర్ టెక్నాలజీని వినియోగించడం, ఎగుమతులకు కొత్త మార్కెట్లను సృష్టించుకోవడం ద్వారా జీఎ్‌సడీపీకి దీని ద్వారా ఊతమివ్వాలనుకుంటున్నట్లు తెలిపింది.