Share News

Global Summit: అంచనాలకు మించి సక్సెస్‌

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:07 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ అంచనాలకు మించి విజయవంతమైంది.....

Global Summit: అంచనాలకు మించి సక్సెస్‌

  • తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతం

  • ఫ్యూచర్‌సిటీకి విస్తృత ప్రచారం

  • సమ్మిట్‌కు 20 రోజుల్లోనే ఏర్పాట్లు

  • అబ్బురపరిచిన ముగింపు వేడుకలు

  • నేటి నుంచి సామాన్యులకూ ప్రవేశం

హైదరాబాద్‌/ (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)/కుందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ అంచనాలకు మించి విజయవంతమైంది. మంగళవారం రెండో రోజు కూడా సమ్మిట్‌ సందడిగా సాగింది. రెండు రోజుల్లో రూ.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు సంబందించిన ప్రతిపాదనలు రావడంతో ప్రభుత్వం ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఏర్పాట్ల నుంచి నిర్వహణ వరకు సమ్మిట్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ సమ్మిట్‌ కారణంగా మీర్‌ఖాన్‌పేట ప్రాంతంలో ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తారల తళుకులు.. రెండో రోజు సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలతోపాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు హాజరయ్యారు. మహీంద్రా కంపెనీ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, సినీ ప్రముఖులు చిరంజీవి, అజయ్‌ దేవగన్‌, అర్జున్‌ కపూర్‌, అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, దిల్‌ రాజు, జెనీలియా, అక్కినేని అమల తదితరులు సందడి చేశారు. అలాగే మంత్రి అజారుద్దీన్‌తోపాటు ప్రముఖ క్రీడాకారులు అనిల్‌ కుంబ్లే, పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు, గుత్తా జ్వాల, బోరియా మంజూదార్‌, అంబటి రాయుడు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో పలు కంపెనీలు ఒప్పందాలు కుదర్చుకున్నాయి. సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘దావోస్‌ సదస్సు కంటే తెలంగాణ సమ్మిట్‌ బాగుందని విదేశీ ప్రతినిధులు చెబుతున్నారు.. బీఆర్‌ఎస్‌ వాళ్లకు ఇంట్లో కూర్చుని ఏడవడం తప్ప మరో దారి లేదు’ అని ఎద్దేవా చేశారు.

20 రోజుల్లోనే ఏర్పాట్లు

ఎంతో అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రభుత్వం కేవలం 20 రోజుల్లోనే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అధికాలు, సిబ్బంది అహర్నిశలు శ్రమించారు. ముఖ్యంగా టీజీఐఐసీ ఎండీ, ప్యూచర్‌ సిటీ ఎండీ శశంక, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, మూసీ రివర్‌ ప్రాజెక్టు ఎండీ నరసింహారెడ్డితో పాటు రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. గ్లోబల్‌ సమ్మిట్‌ ముగింపు వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. సోమవారం ప్రారంభమైన సమ్మిట్‌.. మంగళవారం రాత్రి 9 గంటలకు ముగిసింది. ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్‌ తొలి ప్రతిని సీఎంకు రోబో ఎక్స్‌మ్యాన్‌ అందివ్వటం విశేషం.

నేటి నుంచి సామాన్యులకు ఎంట్రీ

బుధవారం నుంచి 13వ తేదీ వరకు సామాన్యులకు కూడా సమ్మిట్‌ ప్రాంగణంలోకి ప్రవేశం కల్పించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని చార్‌మినార్‌, ఎంజీబీఎస్‌, సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, ఎల్బీనగర్‌, జేబీఎస్‌ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఉచిత బస్సులు నడుపనుంది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 52 బస్సులు నడుపనున్నారు.

Updated Date - Dec 10 , 2025 | 04:07 AM