Share News

Global Summit: 500 ఎకరాల్లో సమ్మిట్‌

ABN , Publish Date - Dec 07 , 2025 | 05:57 AM

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా డిజిటల్‌ స్ర్కీన్‌లు, అందమైన లాన్‌లు, రకరకాల పూలమొక్కలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Global Summit: 500 ఎకరాల్లో సమ్మిట్‌

  • 2వేల మంది కూర్చునేలా ప్రారంభ వేదిక

  • ప్యానల్‌ చర్చల కోసం 6 సెషన్‌ హాళ్లు

  • సీఎం, ప్రముఖుల కోసం ఎంఐపీ హాల్‌

  • వివిధ పథకాల ప్రదర్శనకు వీడియో టన్నెల్‌

  • 10 వేల మంది పోలీసులతో భద్రత

  • అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా డిజిటల్‌ స్ర్కీన్‌లు, అందమైన లాన్‌లు, రకరకాల పూలమొక్కలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఫ్యూచర్‌ సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. వంద ఎకరాల్లో సదస్సు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగు చోట్ల పార్కింగ్‌ స్లాట్లను కూడా కలుపుకొంటే మొత్తం 500 ఎకరాల భూమిని సమ్మిట్‌ కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న మధ్యాహ్నం వరకల్లా ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. దానికంటే ముందుగా 7న ఏర్పాట్లను పరిశీలించడానికి డ్రై రన్‌ను నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి 2వేల మందికి పైగా ప్రముఖులు, ప్రతినిధులు, దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల చైర్మన్లు, ఎండీలు, సీఈవోలు, మంత్రులు, అధికారులు, వివిధ రంగాల నిపుణులు హాజరవుతున్నందున.. ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభ వేదికపై 2వేల మందికి పైగా ప్రతినిధులు కూర్చునేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. సీఎం, మంత్రులు, విదేశీ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వంటి వీఐపీలకు డిన్నర్‌ కోసం, సేదదీరేందుకు మోస్ట్‌ ఇంపార్టెంట్‌ పర్సన్స్‌(ఎంఐపీ)’ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.


వీడియో టన్నెల్‌... వీడియో టవర్లు..

ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్‌ ఏర్పాటు చేశారు. టన్నెల్‌లోకి ప్రవేశిస్తుండగా.. ఇరు వైపులా భారీ స్ర్కీన్లు కనిపిస్తాయి. వీటిపై ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులు, స్కీములు, ఇతర కార్యక్రమాలు ప్రదర్శితమవుతాయి. దీని పక్కనే వీడియో టవర్లను ఏర్పాటు చేశారు. వీటిపై ఉన్న స్ర్కీన్లపై కూడా ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రాజెక్టుల వివరాలను ప్రదర్శిస్తారు. భారీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తారు. 22 ప్రభుత్వ శాఖల స్టాళ్లు, ప్రైవేటు సంస్థల స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 9న సదస్సు ముగిసిన తర్వాత.. 10 నుంచి 13వ తేదీ వరకు సాధారణ ప్రజలు ఎగ్జిబిషన్‌ను వీక్షించడానికి అనుమతిస్తారు. ప్రధాన వేదిక వెనుక ‘గాలాడిన్‌’ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరితోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటర్నెట్‌, వైఫై సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.


మూడంచెల భద్రతా వలయం

సమ్మిట్‌కు హాజరవుతున్న ప్రతినిధుల భద్రత పట్ల పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సమ్మిట్‌ జరుగనున్న ప్రదేశంలో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 44 దేశాల నుంచి వస్తున్న విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతినిధులు బస చేస్తున్న హోటళ్లు, అతిథిగృహాల వద్ద సాయుధ పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రతినిధులు బస చేసే ప్రదేశాలు, వారు ఫ్యూచర్‌ సిటికి వెళ్లే మార్గాల్లో డ్రెస్‌ రిహార్సల్‌ నిర్వహిస్తున్నారు. అతిథులు హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి వారు బస చేసిన ప్రదేశాలు, ఫ్యూచర్‌ సిటికి వెళ్లే రహదారుల్లో పూర్తిగా సీసీ కెమేరాల నిఘా ఏర్పాటు చేశారు. కేవలం ఫ్యూచర్‌ సిటీలోనే వెయ్యికి పైగా కెమెరాలను కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లకు చెందిన సీనియర్‌ పోలీసు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుక్షణం పర్యవేక్షించడానికి మాస్టర్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.


సమ్మిట్‌లో 27 అంశాలపై చర్చ: ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి మొత్తం 27 అంశాలపై చర్చ జరుగుతుందని ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఎ్‌ఫసీడీఏ) కమిషనర్‌ కె.శశాంక తెలిపారు. సదస్సు జరిగే భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సదస్సు నిర్వహణ కోసం 20 రోజుల నుంచి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, రానున్న 22 ఏళ్లలో రాష్ట్రంలో ఏం సాధించనున్నామన్నదే సదస్సు ప్రధాన ఉద్దేశమని అన్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 500-600 మంది వీఐపీలు, 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, అతిథులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఆదివారం డ్రై రన్‌ నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం నాలుగు వేదికలపై చర్చలు జరుగుతాయని, రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్ల ఎగ్జిబిషన్‌ ఉంటుందని చెప్పారు.


భద్రత విధుల్లో 10 వేల మంది పోలీసులు..

దాదాపు 10 వేల మంది పోలీసులు సమ్మిట్‌కు సంబంధించిన భద్రతా విధుల్లో నిమగ్నమవుతారని, వీరికి అదనంగా మరో వెయ్యి మంది ట్రాఫిక్‌ పోలీసులు పనిచేస్తారని, ట్రాఫిక్‌ మార్షల్స్‌తో పాటు గ్రేహౌండ్స్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీం, తెలంగాణ ప్రత్యేక పోలీసు బలగాలు మూడవ భద్రతా వలయంలో ఉంటారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. రెండో వలయంలో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, క్రైం బృందాలు, సాయుధ పోలీసులు ఉంటారని చెప్పారు. తొలి వలయంలో సాయుధ పోలీసులు అడుగడుగునా మోహరిస్తారని, సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, సీనియర్‌ అధికారులంతా అక్కడే ఉంటారని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని అనుక్షణం పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. సాధారణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ సిబ్బందిని, గమనిక బోర్డులను ఏర్పాటు చేశామని, పార్కింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఆరంభ వేడుకలో ఆర్థిక, పారిశ్రామిక వేత్తల ప్రసంగం

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఆరంభ వేడుకలో ప్రముఖ ఆర్థిక, పారిశ్రామికవేత్తలు ప్రసంగించనున్నారు. నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ, వరల్డ్‌ ఎకనామిక్‌ సమ్మిట్‌ సీఈవో జెరెమీ జుర్గెన్స్‌, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి, ట్రంప్‌ మీడియా టెక్నాలజీ గ్రూప్‌ సీఈవో ఎరిక్‌ స్వైడర్‌, బయోకాన్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా... సమ్మిట్‌ ఆరంభ వేడుకలో ప్రసంగించనున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 06:00 AM