Telangana Rising Global Summit: నభూతో నభవిష్యతిగా గ్లోబల్ సమ్మిట్
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:20 AM
భారత్ ప్యూచర్ సిటీలో డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు...
దావోస్ సమ్మిట్ తరహాలో ఏర్పాట్లు ఉండాలి.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం సూచన
అధికారులతో కలిసి పనుల పరిశీలన
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/ కందుకూరు): భారత్ ప్యూచర్ సిటీలో డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రఖ్యాత సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నందున దావోస్ సమ్మిట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ -2025 ఏర్పాట్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ, ప్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ భవన సముదాయ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ నిర్వహించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందనిచెప్పారు. సదస్సుకు వివిధ దేశాల రాయబారులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ శివధర్‌రెడ్డినిఆదేశించారు. పాసులు లేకుండా, సమ్మిట్‌తో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రావడానికి వీలులేదని స్పష్టం చేశారు. శాఖలవారీగా నిర్దేశించిన అధికారులకు మాత్రమే ప్రవేశం ఉండాలని చెప్పారు. అలాగే సమ్మిట్‌కు హాజరయ్యే మీడియా ప్రతినిధులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఏటా గ్లోబల్ సమ్మిట్
ప్యూచర్ సిటీలో ప్రతి సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందువల్ల ఈ ఏడాది నిర్వహించే సమ్మిట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమ్మిట్ రోల్ మోడల్‌గా నిలిచిపోవాలని అన్నారు. ప్యూచర్ సిటీకి మూడు రాష్ట్రాల రాజధానులను నేరుగా అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారులు నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. వీటికి సమాంతరంగా బుల్లెట్ రైలు మార్గాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
స్కిల్ యూనివర్సిటీ పనులపై అసంతృప్తి
ప్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించిన ఆయన.. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి రోజూ పనులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్యూచర్ సిటీ అథారిటీ భవన పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.