Telangana Rising 2047 Vision: అందరికీ అభివృద్ధి
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:59 AM
రాష్ట్రంలోని ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలను సమానంగా అందించడమే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. అందరి దృష్టినీ తెలంగాణ వైపు ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది.....
ప్రతి ఒక్కరికీ ఫలాలు సమానంగా పంచడమే లక్ష్యం
మెరుగైన విద్య, భద్రత,ఉత్తమ వైద్యం, ఉపాధి
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం
జీడీపీకి రాష్ట్రం నుంచి 10ు వాటా అందించడం
రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి
తెలంగాణ రైజింగ్-2047విజన్ డాక్యుమెంట్‌లో సర్కారు లక్ష్యాలు
వచ్చే నెల 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరణ
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలను సమానంగా అందించడమే ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. అందరి దృష్టినీ తెలంగాణ వైపు ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు డిసెంబరు 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్‌లో పలు విషయాలను పొందుపరిచింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 10 శాతం వాటాను అందించేందుకు వీలుగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) ఆధారంగా ఈ అభివృద్ధిని సాధిస్తామని, సమగ్ర, సమాన, స్థిరమైన అభివృద్ధి అనేవి ప్రజలే కేంద్రబిందువుగా ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రధాన ఆశయాలను నిర్దేశించుకున్నట్లు తెలిపింది. మెరుగైన విద్య, ఉత్తమ వైద్యం, పారిశుధ్యం, స్వచ్ఛమైన వాతావరణం, భద్రత, ఇంటి వద్దే అవకాశాలు, భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దే ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఆధునిక నైపుణ్యాలను తమ ప్రధాన ఆశయాలుగా పేర్కొంది. వీటి కోసం 65 శాతం స్పందనలు యువత నుంచే వచ్చాయని తెలిపింది. ఈ అభిప్రాయాలన్నింటి ఆధారంగా ఆర్థిక వ్యవస్థ, యువత, మహిళలు, రైతులు, పెట్టుబడులు, మౌలిక వసతులు, స్థల వినియోగ ప్రణాళిక, వాతావరణ లక్ష్యాలు వంటి ఎనిమిది అంశాలపై దృష్టి పెట్టినట్లు వివరించింది. 2047 నాటికి సమర్థమైన, సమానత్వంతో కూడిన, ప్రపంచ స్థాయిలో పోటీ పడే తెలంగాణను నిర్మించడమే లక్ష్యమని పేర్కొంది. ఈ డాక్యుమెంట్‌లో మొత్తం 8 అధ్యాయాలు, 3 ముఖ్య అమలు సాధనాలు ఉన్నాయని వెల్లడించింది.
మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ..
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, భారతదేశ జీడీపీకి 10 శాతం వాటాను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళతామని ప్రభుత్వం పేర్కొంది. ఈ వృద్ధిని సాధించడానికిగాను.. ఆవిష్కరణల ఆధారంగా టోటల్ ఫ్యాక్టరీ ప్రొడక్టివిటీని పెంచడం, స్టార్ టాలెంట్‌ను రాష్ట్రానికి తిరిగి రప్పించడం, డీప్‌టెక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, సైబర్ సెక్యూరిటీ, జీన్‌టెక్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెట్టడం, స్టార్ట్‌పలకు అనుకూల పరిస్థితులు కల్పించడం, ఎంఎ్‌సఎంఈలను బలోపేతం చేయడం, పర్యాటకం, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల అభివృద్ధి, ప్రపంచ స్థాయి పోటీ శక్తి పెంపు, ఎగుమతుల విస్తరణ వంటివి చేపట్టనున్నట్లు పేర్కొంది.
వ్యూహాత్మక స్థల ఆధారిత ఆర్థిక ప్రణాళిక..
రాష్ట్రాన్ని అర్బన్ కోర్, పెరి అర్బన్, రూరల్ తెలంగాణ పేరిట మూడు ప్రాంతీయ అభివృద్ధి మండలాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ఇందులో అర్బన్ కోర్‌లో హైదరాబాద్ కేంద్రంగా టెక్నాలజీ, డీప్‌టెక్, ఏఐ, ఇండస్ర్టీ 4.0, మాన్యుఫాక్చరింగ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డిజైన్ స్టూడియోలు, ఆర్‌అండ్‌డీ ల్యాబ్‌లు, స్టార్ట్‌పలు, నాలెడ్జ్ ఎకానమీ ప్రధాన కేంద్రంతోపాటు గ్లోబల్ ఇన్నొవేషన్ హబ్‌గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇక పెరి అర్బన్ ప్రాంతాలను.. మధ్య స్థాయి పరిశ్రమలు, ఎంఎ్‌సఎంఈ, లాజిస్టిక్స్ క్లస్టర్లకు కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. వీటిలో మధ్యస్థాయి, క్లస్టర్ ఆధారిత పరిశ్రమలు, పర్యావరణ ప్రమాణాలతో ఆరెంజ్, ఎల్లో వర్గ పరిశ్రమలు, ఎకో ఇండస్ట్రియల్ పార్కులు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుతోపాటు గ్రామీణ ఉత్పత్తులను పట్టణ మార్కెట్లకు అనుసంధానించనున్నట్లు వివరించింది. రూరల్ తెలంగాణను గ్రామీణ జీవనోపాధులు, ప్రకృతి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొంది.
పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా..
తెలంగాణను తయారీ రంగం, నాలెడ్జ్-బేస్డ్ పెట్టుబడుల కోసం ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా మలచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన తయారీ, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ప్రతిభను ఆకర్షించడం, జీవన ప్రమాణాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటరు, అత్యాధునిక ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, శక్తివంతమైన ఎకో సిస్టమ్‌ను నిర్మించడమే లక్ష్యమని తెలిపింది. ప్రగతిశీల విధానాలు, మౌలిక వసతులు, నైపుణ్యంతో కూడిన మానవవనరులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నట్లు పేర్కొంది. పారిశ్రామిక దిగ్గజాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చడం, ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యమని తెలిపింది.
విజయానికి 3 పునాది స్తంభాలు..
టెలంగాణ రైజింగ్-2047 విజయాన్ని నడిపించే మూడు ముఖ్య పునాది స్తంభాలుగా టెక్ అండ్ ఇన్నొవేషన్, సమర్థ ఫైనాన్సింగ్, ఉత్తమమైన పరిపాలన(గుడ్ గవర్నెన్స్)ను ప్రభుత్వం పేర్కొంది. ఇవి అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి, సమాన సేవల అందుబాటు, అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థలను నిర్థారిస్తాయని తెలిపింది.
మహిళలు, యువత, రైతుల కోసం..
యువత, మహిళలు, రైతులను భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి దశలో మహిళలకు సహాయం చేసే లైఫ్-సైకిల్ అప్రోచ్ ద్వారా కోటి మంది మహిళలను మిలియనీర్లను తయారు చేయాలనే లక్ష్యాన్ని సీఎం ప్రస్తావించారు. ఇక యువతకు ఫౌండేషన్ ఎడ్యుకేషన్, భవిష్యత్తు నైపుణ్యాలు అందించడం, విద్యతోపాటు నైపుణ్యాన్ని పెంచడం, కీలకమైన అధునాతన తయారీ, టెక్నాలజీ రంగాల్లో శక్తివంతం చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక పంట వైవిధ్యం, అగ్రిటెక్ వాడకం, విలువ వృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థిరమైన, టెక్నాలజీ ఆధారిత, లాభదాయక వ్యవసాయ వ్యవస్థను నిర్మించాల్సి ఉంటుందని తెలిపింది.
ఆరోగ్యం, పోషణ, విద్య..
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌లో మానవ అభివృద్ధికి ప్రధాన స్థానం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్యాన్ని ప్రధాన లక్ష్యంగా పరిగణిస్తూ ప్రాథమిక వైద్యం, వ్యాధి నిరోధక విధానాలను మరింత బలోపేతం చేయడం. డిజిటల్ హెల్త్ మౌలిక సదుపాయాలు, బయోబ్యాంకులు, ఆరోగ్య సిబ్బంది సామర్థ్య వృద్థి వంటి అంశాలపై పెట్టుబడులు పెట్టనుంది. ఇందులోభాగంగా వృద్థులు, దీర్ఘకాలిక రోగాల సంరక్షణ, అందరికీ అందుబాటులో చౌకైన ఆరోగ్య సేవలు, టెక్నాలజీ ద్వారా లాస్ట్-మైల్ డెలివరీ, వైద్య విద్య, పోషణ, సామాజిక సంక్షేమం వంటివాటిపై దృష్టా సారిస్తుంది. ప్రతి పౌరుడూ ఆరోగ్యవంతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పిస్తుంది. ఇక సుస్థిరత, క్లైమేట్ రెసిలియన్స్, ఆర్థిక వృద్ధి-పర్యావరణ బాధ్యతలను సమతుల్యం చేస్తూ తెలంగాణను నెట్-జీరో ఎమిషన్స్ రాష్ట్రంగామలచడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. దీని ప్రధాన వ్యూహాలుగా.. పునరుత్పాదక శక్తిపై భారీ పెట్టుబడులు, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్క్యులర్ ఎకానమీ, పరిశ్రమల్లో కార్బన్ నిరోధక మార్గాలను అవలంబించేలా విధానాలు ఉంటాయని వెల్లడించింది.