Telangana Rising 2047 Vision: విజన్ డాక్యుమెంట్ మనందరిది
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:51 AM
తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రజలందరిది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. డాక్యుమెంట్ రూపకల్పనలో పాలుపంచుకున్న.....
ఇది కేవలం పత్రం కాదు.. మన భవిష్యత్తుకు ప్రతిజ్ఞ
వివిధ వర్గాల జ్ఞానం, ఆశయాల సమష్టి సృష్టి
గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో..డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రజలందరిది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. డాక్యుమెంట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్’ ముగింపు కార్యక్రమంలో, అంతకుముందు ‘3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా.. మూలధనం, ఉత్పత్తి’ అనే అంశంపై నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఆయన మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ కొంత మంది గదిలో కూర్చుని రూపొందించిందని కాదని, విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమష్టి సృష్టి అని తెలిపారు. ‘‘ఈ పత్రం ఒక శాఖ పనికాదు. ఒక నిపుణుల బృందం రాసింది కాదు. నెలల తరబడి క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రజా చర్చలు, స్థానికుల అభిప్రాయాలను సేకరించి రూపొందించిన పత్రం. రైతులు, యువత, వ్యాపారులు, కూలీలు వేలాదిగా తమ భవిష్యత్తుకు సంబంధించి సూచనలు చేశారు’’ అని డిప్యూటీ సీఎం వివరించారు. ‘3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా.. మూలధనం, ఉత్పత్తి’ అనే అంశంపై చర్చా గోష్ఠిలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. రాబోయే 22 ఏళ్లలో ఈ లక్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 16 రెట్ల ఆర్థిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందన్నారు.
భవిష్యత్తుకు ఒక ప్రతిజ్ఞ..
‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్ కేవలం ఒక పత్రం కాదని, మన భవిష్యత్తుకు ఒక ప్రతిజ్ఞ అని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక వృద్ధి సాధించాలంటే మన ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సమీకరణాన్ని మార్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం మూలధనం, ఆవిష్కరణల ఆధారంగా ఉత్పాదకతను పెంచాల్సి ఉంటుందన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌స’లో ర్యాంకులు పెరిగితే సంతోషించామని, కానీ.. ప్రపంచం చాలా వేగంగా మారిందని తెలిపారు. డీప్‌టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనేది కనీస అర్హత అని, అది ఒక బేస్‌లైన్ మాత్రమేనని అన్నారు. ఆసియాలో ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం రెగ్యులేటర్‌గా కాకుండా.. రిస్క్‌ను పంచుకునే క్యాపిటలిస్టుగా, ప్రజల కోసం రివార్డులు పొందే భాగస్వామిగా మారడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఉత్పాదకతలో ఆటోమేషన్‌ను జొప్పిస్తే ఉద్యోగాలు తగ్గిపోతాయన్న భయం ఉందని, దీనిని ఎలా ఎదుర్కోవాలన్నదే సమస్య అని అన్నారు. ఈ చర్చా గోష్ఠిలో సెంటర్ ఫర్ ఎనలైటికల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న తంత్రి, యువ పారిశ్రామికవేత్త పరశురాం, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.