Telangana CM Revanth Reddy: డిసెంబరు 8న తెలంగాణ రైజింగ్ - 2047 పాలసీ ఆవిష్కరణ
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:56 AM
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ అయిన తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్‌ను డిసెంబరు 9న ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.....
ఆ పాలసీ ఆధారంగానే భవిష్యత్తు నిర్ణయాలు
సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ అయిన తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌ను డిసెంబరు 9న ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఆ పాలసీ డాక్యుమెంటుతో పెట్టుబడిదారులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో ఒక స్పష్టత వస్తుందన్నారు. ఆ డాక్యుమెంట్ ఆధారంగానే భవిష్యత్తు నిర్ణయాలూ జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబరు 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025పై సీఎం రేవంత్ శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్లను ఈ నెలాఖరులోగా సిద్ధంగా చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌లో శాఖలవారీ పాలసీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, ఇతర అంశాలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అలాగే, ప్రజా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా డిసెంబరు8న ప్రభుత్వ రెండో వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఉన్నతాధికారులకు సూచించారు.