Share News

Disaster Relief from Centre: 5 వేల కోట్లు ఇవ్వండి

ABN , Publish Date - Sep 05 , 2025 | 05:02 AM

తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు...

Disaster Relief from Centre: 5 వేల కోట్లు ఇవ్వండి

  • జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోండి

  • భారీ వర్షాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది

  • ప్రాథమిక అంచనా ప్రకారం రూ.5018.72 కోట్లు

  • గత, ప్రస్తుత సాయం 16,732 కోట్లు అందించండి

  • ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలకు ఆర్థికసాయం ఇవ్వండి

  • గిరిజన ప్రాంతాలకు నిధులు మంజూరు చేయండి

  • కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మల, పెమ్మసానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల విజ్ఞప్తులు

  • కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపుతామన్న షా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పంట, ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని, కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం వారు ఢిల్లీలో అమిత్‌ షాను ఆయన అధికారిక నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25 శాతం అధికంగా ఉందని పేర్కొన్నారు. ఎనిమిది జిల్లాల్లో 65 నుంచి 95 శాతం అదనపు వర్షపాతం నమోదైందని, వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, పంటలు, పశువులు, మానవ ప్రాణాలు నష్టపోయాయని వివరించారు. అలాగే, గతేడాది ఖమ్మం, పరిసర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రూ.11,713 కోట్ల సహాయం కోరినప్పటికీ.. కేంద్రం నిధులేమీ ఇవ్వలేదని, కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తుచేశారు. దాంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్‌ షా దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో కోరిన రూ. 11,713 కోట్లతోపాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం రూ.5,018 కోట్లు కలిపి మొత్తం రూ.16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వనరులను సమీకరించి సహాయక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఏడు ఎన్డీఆర్‌ఎఫ్‌, 15 ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు, సుమారు 100 మంది సైనిక సిబ్బంది సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని వివరించారు.


తీవ్రంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు

72 గంటలపాటు కురిసిన వర్షాల తీవ్రతతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, కల్వర్టులు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సాధారణ జీవనానికి అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్‌ షా.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపి నష్టాలను అంచనా వేయిస్తామని హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్య, పోషకాహార రంగాల్లో తరతరాలుగా అసమానతలు ఉన్నాయని, వాటిని రూపుమాపేందుకే ఈ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమగ్ర విద్యా విధానం కోసం రూ.30 వేల కోట్లు అంచనా వ్యయంగా ఉందన్నారు. ఇందుకు వనరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం, అనుబంధ పెట్టుబడుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రయోజన కార్పొరేషన్‌ ద్వారా రుణాలు సేకరించాలని ప్రతిపాదిస్తోందని చెప్పారు. ఈ రుణాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని, దాంతోపాటు కేంద్రం ప్రత్యేకంగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం అధిక వడ్డీతో తీసుకున్న రుణాల పరిమితిని సడలించాలని, లోన్‌ రీస్ట్రక్చరింగ్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలో పామాయిల్‌ సాగు ఎక్కువగా ఉన్నందున పామ్‌ ఆయిల్‌పై విధించే సుంకాన్ని పెంచాలన్నారు.

kugy.jpg

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులివ్వండి..

రూరల్‌ రోడ్డు కనెక్టివిటీ ప్రోగ్రాం కింద ఖమ్మంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.110 కోట్లు ఇవ్వాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మంత్రి తుమ్మల కోరారు. ఢిల్లీలో పెమ్మసానితో తుమ్మల భేటీ అయ్యారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అక్కడ సిమెంట్‌ కాంక్రీట్‌ డ్రైనేజింగ్‌ నెట్‌వర్క్‌ నిర్మాణానికి ఖమ్మం పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రతిపాదనలు రూపొందించిందని తెలిపారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Updated Date - Sep 05 , 2025 | 07:36 AM