Share News

Telangana Government: పట్టణాల ప్రగతికి భారీ నిధులు

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:31 AM

కోర్‌ అర్బన్‌ సిటీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు సర్కారు భారీగా నిధులు విడుదల చేసింది...

Telangana Government: పట్టణాల ప్రగతికి భారీ నిధులు

  • 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి రూ.2780 కోట్లు విడుదల

  • మార్చికల్లా పనుల పూర్తికి పురపాలకశాఖ ఆదేశం

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్ర జ్యోతి): కోర్‌ అర్బన్‌ సిటీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు సర్కారు భారీగా నిధులు విడుదల చేసింది. తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2027లో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పట్టణాలను గ్రోత్‌ హబ్‌గా తీర్చి దిద్దాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. మెరుగైన పౌర సదుపాయాల కల్పన, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లకనుగుణంగా మున్సిపాలిటీల అభివృద్ధికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 138 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో 2,432 పనులు చేపట్టేందుకు రూ.2,780 కోట్ల నిధులను మంజూరు చేసింది. నగరాభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులతోపాటు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (యూఐడీఎఫ్‌) నుంచి ఈ నిధులు మంజూరయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున.., అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు, కొత్త నగర పాలక సంస్థలకు రూ.30 కోట్ల చొప్పన కేటాయించారు. వచ్చే ఏడాది మార్చికల్లా పనులు పూర్తి చేయాలని ఆయా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను పురపాలకశాఖ ఆదేశించింది. ఇక ఆయా పనులను చేపట్టడానికి ప్రాధాన్య క్రమంలో నిధులు ఖర్చు చేయాలని మార్గదర్శకాలు ఖరారు చేసింది. మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రోడ్లు, వర్షపు నీరు, మురుగునీటి కోసం డ్రైన్ల నిర్మాణం, చెరువులూ కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రాంతాల్లో మౌలిక వసతులు, పార్కుల అభివృద్ధి, కల్వర్టులు- వాణిజ్య సముదాయాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అన్ని మున్సిపాలిటీల్లో సంబంధిత విభాగాలు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని పురపాలకశాఖ ఆదేశించింది.

Updated Date - Oct 25 , 2025 | 05:31 AM