Second phase Panchayat elections: రెండో విడతలో 85.86 శాతం
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:02 AM
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 3911 పంచాయతీల పరిధిలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది....
ఓటు హక్కు వినియోగించుకున్న 46,70,972 మంది
భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72 శాతం.. నిజామాబాద్‌లో అత్యల్పంగా 76.71 శాతం పోలింగ్
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 3911 పంచాయతీల పరిధిలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అందించిన సమచారం మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు 80.84 శాతం పోలింగ్ నమోదైంది. అయితే అప్పటికే ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో ఉన్నవారికి సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో 85.86 శాతంతో మొత్తం 46,70,972 ఓట్లు పోలయ్యాయి. రెండో విడత ఎన్నికల్లో 54,40,339 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా.. 46,70,972 మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72 శాతం పోలింగ్ నమోదవగా.. నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.71ు నమోదైంది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు ప్రారంభించారు. ఎక్కువ మంది ఓటర్లు క్యూలైన్లలో ఉన్నచోట మాత్రం కొంత ఆలస్యం జరిగింది. ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో పోటీపడి విజేతలుగా నిలిచిన వారిని సంబంధిత ఆర్‌వోలు అక్కడికక్కడే ప్రకటించారు. ఎస్‌ఈసీ అందించిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటల వరకు 1708 సర్పంచ్, 15,918 వార్డు సభ్యుల స్థానాల ఫలితాలను వెల్లడించారు. అదే సమయంలో ఉప సర్పంచుల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తిచేసినట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి. కాగా, పోలింగ్ ప్రక్రియను ఎస్‌ఈసీ కమిషనర్ రాణి కుముదిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.
ప్రశాంతంగా రెండోదశ పోలింగ్
రెండో దశ పోలింగ్ సందర్భంగా చెదరుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను, వ్యూహాత్మక నిఘా బృందాలను నియమించామని.. దీంతో చిన్న అలజడి చెలరేగినా నిమిషాల్లో అదనపు పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దగలిగారని ఆయన వివరించారు. మొదటి, రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసిన పోలీసు సిబ్బంది, అధికారులను డీజీపీ అభినందించారు.
వెంకటే్‌షఖనిలో బీఆర్‌ఎ్‌సకు నాలుగు ఓట్లే!
కొత్తగూడెం జిల్లాలోని వెంకటే్‌షఖని గ్రామం కనుమరుగైనప్పటికీ అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఈ పంచాయతీలో కేవలం 183 మంది ఓటర్లుండగా.. 140 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ బీఆర్‌ఎ్‌సకు కేవలం నాలుగు ఓట్లే వచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన బుగ్గం రవీందర్‌కు 76, సీపీఐ అభ్యర్థి బుగ్గం మంజులకు 56 ఓట్లు రాగా.. చెల్లని ఓట్లు మూడు, నోటాకు ఒక ఓటు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం శేరిగూడెంలో ఓ వ్యక్తి దొంగ ఓటు వేసేందుకు రాగా ఏజెంట్లు గుర్తించి అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
17న మూడో విడత ఎన్నికలు
మూడో విడత పంచాయతీ ఎన్నికలను ఈ నెల 17న చేపట్టనున్నారు. సోమవారం సాయంత్రంతో ఆయా గ్రామాల్లో ప్రచారం ముగియనుంది. ఎస్‌ఈసీ షెడ్యూల్ ప్రకారం మూడో విడతలో మొత్తం 4157 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 394 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 11 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 3752 సర్పంచ్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఒక్కో స్థానానికి సగటున నలుగురు చొప్పున 12640 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా 36,434 వార్డులకు గాను 7916 ఏకగ్రీవం అయ్యాయి. 112 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 28,406 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 75,283 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈ నెల 20న ప్రమాణం చేయనున్నారు.