CAG Report: 8 నెలల్లో రాబడి 1,66,785 కోట్లు
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:40 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో (ఏప్రిల్-నవంబరు) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,66,785.68 కోట్ల రాబడి సమకూరింది.
నవంబరు నాటికి లక్ష్యంలో చేరుకున్నది 58.55 శాతమే
పన్నుల ద్వారా రూ.1,00,443 కోట్ల రాబడి
అప్పుల సేకరణ 107 శాతానికి పెరుగుదల
8 నెలల్లో వ్యయం రూ.1,54,499 కోట్లు.. ‘కాగ్’ నివేదిక
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో (ఏప్రిల్-నవంబరు) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,66,785.68 కోట్ల రాబడి సమకూరింది. ఇది ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసిన మొత్తంలో 58.55 శాతానికి సమానం. దీంతో మిగిలిన నాలుగు నెలల్లో లక్ష్యం మేర రాబడులు సమకూరుతాయా అనే సందిగ్ధత నెలకొంది. అప్పులు, పన్నులు, పన్నేతరాలు, కేంద్ర గ్రాంట్లు-కాంట్రిబ్యూషన్లు, రుణాలు, అడ్వాన్సుల రికవరీ, ఇతర రిసీట్స్ అన్నీ కలిపి ఈసారి రూ.2,84,837.30 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే నవంబరు నాటికి (8 నెలల్లో) రూ.1,66,785.68 కోట్లు మాత్రమే (58.55 శాతం) సమకూరాయి. ఈమేరకు రాష్ట్ర రాబడులు, వ్యయాలకు సంబంధించి కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) బుధవారం విడుదల చేసిన నవంబరు నివేదికలో పేర్కొంది. మొత్తం రాబడుల్లో రెవెన్యూ రాబడుల ద్వారా రూ.2,29,720.63 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. రూ.1,08,685.45 కోట్లు(47.31ు) వచ్చాయి. ఇందులో పన్నుల కింద అంచనా వేసిన రూ.1,75,319.36 కోట్లకుగాను రూ.1,00,443.26 కోట్లు(57.29ు) సమకూరాయి. ఈ పన్నుల్లో వస్తు సేవల పన్ను(జీఎ్‌సటీ) కింద అంచనా వేసిన రూ.59,704.59 కోట్లకుగాను రూ.34,923.84 కోట్లు(58.49ు), స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19,087.26 కోట్లకుగాను రూ.9,911.26 కోట్లు(51.93ు), సేల్స్ ట్యాక్స్ ద్వారా రూ.37,463.90 కోట్లకుగాను రూ.21,512.71 కోట్లు(57.42ు), రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా రూ.27,623.36 కోట్లకుగాను రూ.15,142.71 కోట్లు(54.82ు), కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.21,195.18 కోట్లకుగాను రూ.13,468.88 కోట్లు(63.55ు), ఇతర పన్నులు, సుంకాల కింద రూ.10,233.87 కోట్లకుగాను రూ.5,483.41 కోట్లు(53.58ు), పన్నేతర రాబడి కింద రూ.31,618.77 కోట్లకుగాను రూ.4,770.18 కోట్లు(15.09ు), కేంద్ర గ్రాంట్లు-కాంట్రిబ్యూషన్ల ద్వారా రూ.22,782.50 కోట్లకుగాను రూ.3,472.01 కోట్లు(15.24ు) సమకూరాయి.
నవంబరు నాటికి రూ.58,068.90 కోట్లు సేకరణ..
ఇక మూలధన రాబడుల్లో భాగంగా అప్పుల కింద రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు సేకరించింది. మార్కెట్ రుణాల కింద రూ.54,009.74 కోట్లు తీసుకోనున్నట్టు ప్రకటించగా.. నవంబరు నాటికే రూ.58,068.90 కోట్లు సేకరించింది. దీంతో అంచనాను మించి 107.52 శాతంగా నమోదైంది. తెలంగాణ రూ.71 వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి పార్లమెంటులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.58,068కోట్ల మేర అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు కలిపి నవంబరు నాటికి ప్రభుత్వానికి రూ.1,66,785.68 కోట్లు సమకూరాయి. నవంబరు నాటికి ప్రభుత్వం అన్ని రకాల వ్యయాల కింద రూ.1,54,499.48 కోట్లు ఖర్చు చేసింది. ఇది ప్రతిపాదిత వ్యయం రూ.2,63,486.73 కోట్లలో 58.64 శాతం. ఇందులో ప్రధానంగా పథకాలకు రూ.45,046.99కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.18,486.79 కోట్లు, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.32,007.74 కోట్లు, పెన్షన్లకు రూ.12,526.70 కోట్లు, సబ్సిడీలకు రూ.9,990.17 కోట్లు ఖర్చు చేసింది.