Share News

No Funds Under PMJVK for Three Years: మైనార్టీ నిధుల్లో తెలంగాణకు మొండిచేయి

ABN , Publish Date - Dec 04 , 2025 | 05:23 AM

మైనార్టీ సంక్షేమానికి సంబంధించి నిధుల విడుదలలో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపుతోంది. ప్రధాన్‌ మంత్రి జన్‌ వికాస్‌ కార్యక్రమం...

 No Funds Under PMJVK for Three Years: మైనార్టీ నిధుల్లో తెలంగాణకు మొండిచేయి

  • మూడేళ్లుగా ’పీఎంజేవీకే’ కింద ఒక్క రూపాయి అందలేదు

న్యూఢిల్లీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మైనార్టీ సంక్షేమానికి సంబంధించి నిధుల విడుదలలో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపుతోంది. ‘ప్రధాన్‌ మంత్రి జన్‌ వికాస్‌ కార్యక్రమం’ కింద గత మూడేళ్లుగా తెలంగాణకు ఒక్క పైసా నిధులివ్వలేదు. ఈ అంశంపై లోక్‌సభలో ఎంపీ రఘువీర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పీఎంజేవీకే పథకం కింద గత మూడేళ్లలో తెలంగాణకు నిధులేమీ విడుదల చేయలేదని తెలిపారు. మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన ప్రి మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకాలు 2021-22 విద్యా సంవత్సరం తర్వాత కొనసాగింపునకు ఆమోదం పొందలేదని తెలిపారు. 2019-22 మధ్యకాలంలో రాష్ట్రంలో ప్రి మెట్రిక్‌ కింద రూ.178 కోట్లు, పోస్ట్‌ మెట్రిక్‌ కింద రూ.45 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. గతంలో ఉన్న ‘నయీ మంజి’, ‘నయీ రోష్ని’, ‘సీఖో ఔర్‌ కమావో’ వంటి నైపుణ్యాభివృద్ధి పథకాలను నిలిపివేసి, వాటిని కొత్తగా తెచ్చిన ‘పీఎం వికాస్‌’ పథకంలో విలీనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ విలీనం కారణంగా పాత పథకాల కింద గత మూడేళ్లుగా(2022-25) రాష్ట్రానికి కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు కేటాయించలేదని తెలిపారు.

3,133 మంది చిన్నారుల అదృశ్యం

తెలంగాణలో 2023లో 3,133 మంది చిన్నారులు అదృశ్యమైనట్టు కేంద్రం వెల్లడించింది. వీరిలో 2,627 మంది ఆచూకీని గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించినట్టు తెలిసింది. రాజ్యసభలో బుధవారం కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్‌ ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా, తెలంగాణలో బడి బయట ఉన్న పిల్లల సంఖ్య 2024-25 విద్యా సంవత్సరంలో భారీగా పెరిగింది. 2023-24లో 5,440 మంది బడికి దూరంగా ఉండగా 2024-25 నాటికి ఆ సంఖ్య ఏకంగా 11,449కి చేరినట్లు కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ప్రబంధ్‌’ పోర్టల్‌ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 2021-22లో మొత్తం 9,113 మంది పిల్లలు బడి బయట ఉండ గా అందులో 4,313 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఈ సంఖ్య 2022-23లో తగ్గి 5,255కి(బాలికలు 2,437) చేరిందన్నారు. అయితే 2023-24 నాటికి ఆ సంఖ్య మొత్తం 5,440 మంది(బాలికలు 2,426) చేరగా, 2024-25కి 11,449కి పెరిగిందని కేంద్రమంత్రి వివరించారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4,753 మంది(బాలికలు 2,006) బడి బయట ఉన్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 05:23 AM