Hydroelectric Power Hits New Record: సాధారణం 740 మి.మీ.నైరుతిలోనే 988
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:34 AM
రాష్ట్రంలో ఈ ఏడాది నైరుతిలో వానలు దంచికొట్టాయి. నాలుగు నెలల వ్యవధిలోనే ఏడాది సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదైంది...
4 నెలల్లోనే వార్షిక సగటు కన్నా ఎక్కువ
ఏడాది సాధారణ వర్షపాతం 923 మి.మీ
ఇంకా నిష్క్రమించని రుతుపవనాలు
2 వారాల్లో తిరోగమిస్తాయి: శాస్త్రవేత్తలు
బంగాళాఖాతంలో వాయుగుండం
నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
జలవిద్యుత్ ఉత్పత్తిలోనూ రికార్డులు
2 నెలల్లోనే 4,062 మిలియన్ యూనిట్లు
సాగర్‌లో ఏడాది లక్ష్యం ఇప్పటికే చేరిక
హైదరాబాద్/నాగార్జునసాగర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది నైరుతిలో వానలు దంచికొట్టాయి. నాలుగు నెలల వ్యవధిలోనే ఏడాది సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదైంది. నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం 740.6 మి.మీ.గా వాతావరణశాఖ నిర్ణయించింది. వార్షిక సగటు వర్షపాతం 923.8 మి.మీ. ఉంటుందని తెలిపింది. అయితే నైరుతిలోనే ఏకంగా 988.3 మి.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇది నైరుతి రుతుపవనాల సగటుతో పోలిస్తే 247.7 మి.మీ అధికం. వార్షిక సగటుతో పోలిస్తే 64.5 మి.మీ అధికంగా నమోదైంది. జూన్ 1న మొదలైన వానాకాలం సీజన్ సెప్టెంబరు 30తో ముగిసింది. నాలుగు నెలల వానాకాలం తర్వాత సాధారణంగా అక్టోబరు 1 నుంచి శీతాకాలం సీజన్ మొదలవుతుంది. కానీ, ఈ నాలుగు నెలల్లో వర్షించి.. ఆ తర్వాత వెనుదిరిగే నైరుతి రుతుపవనాలు మాత్రం ఇంకా నిష్క్రమించలేదు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో నైరుతి నిష్క్రమణ ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ దక్షిణాదికి, తెలంగాణకు వచ్చేసరికి మరో 15 రోజులు పట్టే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో బుధవారం మరో వాయుగుండం ఏర్పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్టోబరు 2 నాటికి వాయుగుండంగా మారి, 3న తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
విద్యుదుత్పత్తిలోనూ రికార్డులు..
ఈ ఏడాది వర్షపాతంలోనే కాకుండా.. జలవిద్యుత్ ఉత్పత్తిలోనూ రికార్డులు నమోదవుతున్నాయి. రిజర్వాయర్ల వద్ద ఉన్న జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి పరుగులు పెడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అత్యధికంగా 2022-23 సంవత్సరంలో రికార్డుస్థాయిలో 6,831 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ ఉత్పత్తి జరగగా.. ఈ ఏడాది (2025-26లో) ఆ రికార్డు బద్దలయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జూలై 29 నుంచి సెప్టెంబరు 29 నాటికి రెండు నెలల వ్యవధిలోనే 4,062 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే ఈ అంచనాలకు కారణం. కేవలం నాగార్జునసాగర్‌లోనే రెండు నెలల్లో 1450 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయ డం గమనార్హం. వాస్తవానికి సాగర్‌లో ఈ ఏడాది మొత్తం 1450 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, కేవలం రెండు నెలల్లోనే (సెప్టెంబరు 30 నాటికే) లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో అధికారులు, ఇంజనీర్లు మంగళవారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎగువ నుంచి వరద రాక మరో రెండు నెలలు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది 3వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని జెన్‌కో సీఈ మంగేశ్‌కుమార్ తెలిపారు. సాగర్ చరిత్రలో 2019-20 నుంచి ఈ ఏడాది వరకు 2022-23లో ఉత్పత్తి చేసిన 2355.63 మిలియన్ యూనిట్లే అత్యధికం కావడం గమనార్హం.