Ration Dealers Demand: నెలాఖరులోగా 124 కోట్ల బకాయిలు చెల్లించాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:26 AM
రేషన్.. డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు రూ.124 కోట్లను ఈనెలాఖరు లోపు చెల్లించాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది
లేనిపక్షంలో 1, 2 తేదీల్లో నిరసన దీక్ష చేపడతాం
3 నుంచి రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం:డీలర్ల సంఘం
పంజాగుట్ట, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రేషన్ డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు రూ.124 కోట్లను ఈనెలాఖరు లోపు చెల్లించాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. లేకపోతే అక్టోబరు 1, 2 తేదీల్లో సోమాజిగూడలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ఉపవాస నిరసన దీక్షను చేపడతామని సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ప్రకటించారు. అయినా, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే అక్టోబరు 3 నుంచి రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని ఆయన హెచ్చరించారు. పండుగ సమయంలో తమ బకాయిలు విడుదల కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలుగా తమ కమీషన్ డబ్బులు చెల్లించడం లేదని, సుమారు రూ. 124 కోట్లు, గన్ని సంచులకు సంబంధించి సుమారు రూ.15 కోట్ల మేరా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. వీటిని ఈ నెలాఖరు లోపు చెల్లించాలని రాజు డిమాండ్ చేశారు.