Card Holders: రాష్ట్రంలో అందరూ పేదలే
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:57 AM
రాష్ట్రంలో అందరూ పేదలే..! అవును మీరు చదివింది నిజమే, మన రాష్ట్ర జనాభా అక్షరాలా 3.50 కోట్లు తెల్లరేషన్ కార్డులున్న లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 3.25 కోట్లు..
రాష్ట్ర జనాభా 3.50 కోట్లు.. తెల్ల రేషన్‌కార్డుల లబ్ధిదారులు 3.25 కోట్ల మంది!
రాష్ట్రంలో మొత్తం 1,01,22,324 కార్డులు
కొత్తగా 2.50 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కారు
అప్పుడు 3.35 కోట్లకు చేరనున్న లబ్ధిదారుల సంఖ్య!
దారిద్య్ర రేఖకు పైన ఉండేది 15 లక్షల మందే!!
10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి?
పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడ?
రాష్ట్రంలో 25లక్షల కార్లు.. వారిలో కార్డుల్లేని కుటుంబాలెన్ని?
ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు?
అనర్హులకూ ఆహార భద్రత కార్డులు.. పొంతన లేని లెక్కలు!
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అందరూ పేదలే..! అవును మీరు చదివింది నిజమే!! మన రాష్ట్ర జనాభా అక్షరాలా 3.50 కోట్లు! తెల్లరేషన్ కార్డులున్న లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 3.25 కోట్లు..!! మరో 2.50 లక్షల రేషన్‌కార్డులు జారీచేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరిగి.. తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారుల సంఖ్య 3.35 కోట్లకు చేరుతుంది!! రాష్ట్ర జనాభా 3.50 కోట్లు కాగా.. అందులో 3.35 కోట్ల మంది పేదలే..! కేవలం 15 లక్షల మందే దారిద్య్ర రేఖకు ఎగువన ఉంటారన్నమాట!! రాష్ట్రంలో ఉన్న తెల్లరేషన్ కార్డులు, జనాభా లెక్కలను పోల్చి చూస్తే.. ఈ విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనేది ఎన్నికల హామీగా మారిపోయింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటోంది. ప్రతి ప్రభుత్వం ఎన్నో కొన్ని రేషన్ కార్డులు జారీ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెల్లకార్డుల పంపిణీ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా జరుగుతోంది. కుటుంబాల సంఖ్య, జనాభా పెరుగుతున్న కొద్దీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో 89,95,282 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపై 2,81,47,565 మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. మీ-సేవలో చేసిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంది. పాత, కొత్త దరఖాస్తులు కలిపి 18 లక్షలు వస్తే.. ఇప్పటివరకు 11.27 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 1,01,22,324కు.. లబ్ధిదారుల సంఖ్య 3,25,02,345కు చేరింది. మరో 2.50 లక్షల రేషన్ కార్డులు జారీచేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరుగుతుంది. అప్పుడు రాష్ట్రంలోని లబ్ధిదారుల సంఖ్య 3.35 కోట్లకు చేరుతుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంటే.. 3.35 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారన్నమాట!
నిబంధనలకు పాతర.. కార్డుల జాతర!
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికే ఆహారభద్రత కార్డులు పంపిణీ చేయాలి. అలాగే 5 ఎకరాలకు మించి భూమి ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకూడదు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కార్డులు ఇవ్వొద్దనే నిబంధన ఉంది. ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ తీసుకునేవారు కూడా అనర్హులే. వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెట్లు తదితర వృత్తి నిపుణులు, పెద్ద వ్యాపారులు, మిల్లర్లు, పెట్రోలు బంకుల నిర్వాహకులు, బోర్‌వెల్ యజమానులు కూడా తెల్ల రేషన్‌కార్డులు తీసుకోవడానికి వీల్లేదు. కార్లు ఉన్న వారూ అనర్హులే. కానీ, ఇలాంటి వారందరికీ తెల్లరేషన్ కార్డులు జారీచేశారు. ఉదాహరణకు రాష్ట్రంలో 25 లక్షల కార్లు ఉన్నాయి. వీరిలో చాలా కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు రాష్ట్రంలో 56.11 లక్షల మంది ఉన్నారు. 5-54 ఎకరాల వరకు భూములున్న రైతులు 6 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి తెల్ల రేషన్ కార్డులున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కలిపి 10 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నవారిలో ఉన్నారు. రాష్ట్రంలో బియ్యం, పప్పులు, జిన్నింగ్, నూనె మిల్లులు కలిపి 3 వేల వరకు ఉన్నాయి. ఈ మిల్లుల యజమానుల్లో చాలామంది రేషన్ కార్డులు పొందారు. వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు.. తదితర వృత్తి నిపుణులు కూడా రేషన్ కార్డులు తీసుకున్న జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం కార్డుల్లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన జాతీయ ఆహారభద్రత కార్డులు 56,27,285 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సడలించి, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జారీ చేసే కార్డులతోనే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. తద్వారా అనర్హులూ లబ్ధి పొందుతున్నారు.
సంక్షేమ పథకాలే లక్ష్యంగా..
పేదలకు ఆహార భద్రత కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు జారీచేస్తున్నాయి. అయితే వీటిని ఇతర సంక్షేమ పథకాలకు కూడా ప్రామాణికంగా తీసుకుంటుండడంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగింది. అధికారులను మచ్చిక చేసుకొని, రాజకీయ నాయకులతో పైరవీలు చేయించుకొని, అవసరమైతే ముడుపులు ముట్టజెప్పి అనర్హులు కూడా రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ, వృద్ధాప్య పింఛన్లు, వితంతు, వికలాంగులు, గీతకార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికుల పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్.. తదితర సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వారు కూడా ఏదో ఒక ప్రభుత్వ పథకానికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో దొడ్డిదారిలో కార్డులు పొందుతున్నారు. ప్రతినెలా రేషన్ బియ్యం అవసరంలేని వారికి కూడా తెల్లకార్డులు ఉన్నాయి. ఇలా ఇబ్బడిముబ్బడిగా కార్డులు జారీచేయడంతో సంక్షేమ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ పథకాలకు అధిక నిధులు కేటాయించాల్సి వస్తోంది.