Minister Surekha: ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:58 AM
ఓ వైపు ప్రకృతిని కాపాడుతూనే మరోవైపు స్థానిక ప్రజల జీవనోపాధిని పెంచే బాధ్యతాయుత ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు.....
చారిత్రక, పౌరాణిక ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం: మంత్రి సురేఖ
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు ప్రకృతిని కాపాడుతూనే మరోవైపు స్థానిక ప్రజల జీవనోపాధిని పెంచే బాధ్యతాయుత ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. సరస్సులు, గడ్డి భూములు, జాతీయ ఉద్యానవనాలు, అమ్రాబాద్ - కవ్వాల్ వంటి ప్రముఖ టైగర్ రిజర్వులతో రాష్ట్రం సహజసిద్ధమైన సంపదను కలిగి ఉందన్నారు. మొత్తం 7,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రక్షిత వన్యప్రాంతాలు, సహజసిద్ధమైన ప్రకృతి ఉండడంతో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ‘ఎక్స్‌పీరియన్స్ తెలంగాణ, హెరిటేజ్, కల్చర్, ఫ్యూచర్ రెడీ టూరిజం’’ అనే అంశంపై జరిగిన చర్చలో మంత్రి సురేఖ మాట్లాడారు. ప్రైవేటు రంగంతో కలిసి కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 13 ఎకో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేయగా, రామప్ప-శ్రీశైలం లాంటి వారసత్వ-ఆధ్యాత్మిక కేంద్రాలను ప్రకృతి పర్యాటకంతో అనుసంధానిస్తున్నామన్నారు.