Share News

Parliament: యాసంగికి ఇప్పటికే 2.29 లక్షల టన్నుల యూరియా

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:36 AM

తెలంగాణలో యాసంగి సీజన్‌కు యూరియా సిద్ధంగా ఉందని.. డిసెంబరు 1 నాటికి 2.29 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలున్నాయని కేంద్రం తెలిపింది...

Parliament: యాసంగికి ఇప్పటికే 2.29 లక్షల టన్నుల యూరియా

  • ఎరువుల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..

  • పాస్‌పోర్ట్‌ సేవల్లో హైదరాబాద్‌ రీజియన్‌ టాప్‌

  • తెలంగాణకు మూడు ఆయుష్‌ ఆస్పత్రులు..

  • తెలంగాణ ఎంపీల ప్రశ్నలు..కేంద్రం జవాబులు

న్యూఢిల్లీ/హనుమకొండ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో యాసంగి సీజన్‌కు యూరియా సిద్ధంగా ఉందని.. డిసెంబరు 1 నాటికి 2.29 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలున్నాయని కేంద్రం తెలిపింది. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ప్రశ్నకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ సమాధానమిచ్చారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో తెలంగాణకు డిమాండ్‌ కంటే ఎక్కువ మొత్తంలో యూరియా సరఫరా చేశామన్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉండగా, 10.28 లక్షల మెట్రిక్‌ టన్నులను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ఇందులో 9.79 లక్షల మెట్రిక్‌ టన్నులే విక్రయించారని, సీజన్‌ ముగిసే నాటికి (సెప్టెంబరు 30) రాష్ట్రం వద్ద ఇంకా 49 వేల టన్నుల నిల్వలు మిగిలే ఉన్నాయన్నారు. ఇటు జీరో అవర్‌లోనూ మల్లు రవి మాట్లాడారు. దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. యాక్సెసబుల్‌ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా ఉద్యోగాల్లో 4 శాతం, సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పాస్‌పోర్ట్‌ సేవల్లో హైదరాబాద్‌ రీజియన్‌ అత్యుత్తమ ప్రతిభను చూపిందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా తెలిపారు. ఆ ఆఫీస్‌ పరిధిలో పాస్‌పోర్ట్‌ల కోసం నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గిందని ఎంపీ బలరాం నాయక్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

గోదావరి ద్వారా బొగ్గు రవాణాతో అదనపు భారం..

తెలంగాణలోని రామగుండం ఎన్టీపీసీకి గోదావరి నది ద్వారా బొగ్గు రవాణా చేయడం అదనపు భారంతో కూడుకున్న పని అని కేంద్రం తేల్చి చెప్పింది. ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నలకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ సమాధానాలిచ్చారు. తెలంగాణకు మూడు 50 పడకల ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ ఆస్పత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు కేంద్రం తెలిపింది. కొత్తగా ఆయుష్‌ మెడికల్‌ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని పేర్కొంది. ఎంపీ రఘువీర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రతాప్‌ రావు గణపతిరావు జాదవ్‌ సమాధానమిచ్చారు.


తెలంగాణకు 14 వేల కోట్ల పీఎం కిసాన్‌ నిధులు

పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటివరకు తెలంగాణ రైతులకు రూ.14,234 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రైతులకు రూ.19,121 కోట్లు చెల్లించామని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ రాజ్యసభలో తెలిపారు. తెలంగాణలో 30 లక్షల మంది రైతులు, ఏపీలో 39 లక్షలకు పైగా రైతులు పీఎం కిసాన్‌ ద్వారా లబ్ధి పొందుతున్నారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాల నివారణకు ప్రవేశపెట్టిన ‘కవచ్‌’ వ్యవస్థను మరింత విస్తృతం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.2,354.36 కోట్లు ఖర్చు చేసినట్లు ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమాధానమిచ్చారు. మరోవైపు.. హైదరాబాద్‌ మెట్రో, ఎంఎంటీఎస్‌ రెండో దశకు అనుమతులు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. అనంతరం ఈ విషయమై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

మహిళలకు సౌకర్యాలు, సామాజిక భద్రతపై ఎంపీ కావ్య 2 ప్రైవేటు బిల్లులు..

మహిళలకు రక్షణ, సౌకర్యాలు, సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా ఎంపీ కడియం కావ్య లోక్‌సభలో రెండు కీలక ప్రైవేట్‌ బిల్లులను ప్రవేశపెట్టారు. మూడు దశాబ్దాల తర్వాత తెలంగాణ నుంచి ఒక మహిళా ఎంపీ ఇలాంటి ప్రత్యేక బిల్లులను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఉద్యోగ రంగంలోని మహిళలకు నెలసరి సమయంలో అవసరమైన సౌకర్యాలు, అందుబాటులో గదులు, తగిన ఆరోగ్య వసతులు కల్పించేందుకు చట్టపరమైన నిబంధనలు తప్పనిసరి చేయాలని మొదటి బిల్లులో కావ్య ప్రతిపాదించారు. రెండో బిల్లులో.. ఒంటరి మహిళలు, వితంతువులు, ఆపన్నస్థితిలో ఉన్న స్త్రీలకు ప్రభుత్వం ద్వారా అత్యవసర సాయం, గృహ భద్రత, సామాజిక సంక్షేమ చర్యలు తక్షణం అందేలా ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ రెండు బిల్లులను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

Updated Date - Dec 06 , 2025 | 05:36 AM