Telangana Police: మాల వేసుకోవాలంటే సెలవు తీసుకోండి
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:15 AM
అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్మాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బందికి సూచించింది...
జుట్టు పెంచుకొని, యూనిఫాం, బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు
దీక్షల విషయంలో సిబ్బందికి పోలీసు శాఖ ఉత్తర్వులు
సంతో్‌షనగర్, హైదరాబాద్ సిటీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్మాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బందికి సూచించింది. జుట్టు, గడ్డం పెంచుకొని, యూనిఫామ్‌కు బదులు సాధారణ దుస్తులు ధరించి, కాళ్లకు బూట్లు లేకుండా పోలీసు సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్ ఎస్సై ఎస్.కృష్ణకాంత్ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. దీక్ష నియమాలను పాటిస్తూ విధులకు హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ ఆయన ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని తిరస్కరించిన ఉన్నతాధికారులు.. నిబంధనలపై పోలీసు సిబ్బంది అందరికీస్పష్టతనిచ్చేలా ఓ మెమోను ఇటీవల జారీ చేశారు. అయ్యప్ప మాల సహా మరే ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూడా ఆ దీక్ష నియమాలను పాటించాలి అనుకుంటే విధులకు సెలవు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, పోలీసు శాఖ నుంచి వచ్చిన ఈ ప్రకటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల దీక్ష సమయంలోనే ఇలా చేస్తున్నారని, రంజాన్ సమయంలో ఈ నిబంధనలు ఎందుకు గుర్తు రావు? అని ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఒక వర్గానికి మాత్రమే నిబంధనలు విధించి, మరో వర్గం విషయంలో సానుకూలంగా ఉండడం ఎంత వరకు సబబు? అని నిలదీశారు. నిబంధనలఅమలు అంశంలో హిందు, ముస్లింలను రెండు కళ్లుగా భావించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.