Share News

Poet Ande Sri Bids Final Farewell: సహజకవికి తుది వీడ్కోలు!

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:42 AM

కష్టాలు, కన్నీళ్ల మధ్య ఓ పశువుల కాపరిగా అతి సామాన్యుడి నుంచి తన జీవితానుభవాలే కవితా వస్తువుగా చేసుకొని ప్రజాకవిగా అనన్య సామాన్యుడిగా ఎదిగి....

Poet Ande Sri Bids Final Farewell: సహజకవికి తుది వీడ్కోలు!

  • అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

  • స్వయంగా పాడె మోసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

  • హాజరైన శ్రీధర్‌బాబు, జూపల్లి, అడ్లూరి, మహేశ్‌గౌడ్‌

  • అందెశ్రీ గొప్పమానవతావాది.. ఆయనతో మాట్లాడితే అన్నతో మాట్లాడినట్లు అనిపించేది

  • పాఠ్యపుస్తకాల్లో జయజయహే తెలంగాణ గీతం

  • ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

  • స్మృతివనంగా ఘట్‌కేసర్‌ జంక్షన్‌స్థలం: సీఎం రేవంత్‌

మేడ్చల్‌, మేడ్చల్‌ ఆంఽధ్రజ్యోతి బృందం, హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కష్టాలు, కన్నీళ్ల మధ్య ఓ పశువుల కాపరిగా అతి సామాన్యుడి నుంచి తన జీవితానుభవాలే కవితా వస్తువుగా చేసుకొని ప్రజాకవిగా అనన్య సామాన్యుడిగా ఎదిగి.. జయజయహే తెలంగాణ, జననీ జయకేతనం అంటూ ప్రత్యేక రాష్ట్రానికి గీతాన్ని సృజించి.. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చైతన్యసిరి అందెశ్రీ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఆప్తులైన కవులు, ఉద్యమకారులు, కళాకారుల ఆశ్రునయనాల మధ్య సహజకవి అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ అఫీసు పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ స్థలంలో మంగళవారం పూర్తి అధికార లాంఛనాల మధ్య అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించారు. అందెశ్రీకి గౌరవసూచకంగా పోలీసులు తుపాకులను మూడుసార్లు గాల్లోకి పేల్చారు. అంత్యక్రియలకు సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి, జూపల్లి, అడ్లూరి లక్ష్మణ్‌, టీపీపీసీ అఽధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హాజరై అక్షర యోధుడికి తుది వీడ్కోలు పలికారు. సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా అందెశ్రీ పాడెను మోశారు. అందెశ్రీ కుమారుడితో కలిసి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. నాలుగు కోట్ల జనాల సమస్యలను తన కుటుంబసమస్యగా భావించిన గొప్ప మానవతవాది అందెశ్రీ అని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు. రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీని కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్న సమయంలో అందెశ్రీని కలవాలని ప్రయత్నిస్తే రాజకీయనాయకులకు తాను దూరంగా ఉంటానని, వేదికలపైనే వారిని కలుస్తానని వ్యక్తిగతంగా కలవనని ఓ మిత్రుడి ద్వారా సమాచారం చేరవేశారని గుర్తుచేసుకున్నారు.


అయినా ఒకసారి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చిద్దామని, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మీదైన పాత్ర పోషించాలని ఆయన్ను తాను కోరడం జరిగిందన్నారు. అప్పట్లో తాను పార్టీని నడిపించే క్రమంలో తనకు అందెశ్రీ ఒక గొప్ప స్పూర్తినిచ్చారని కొనియాడారు. కొట్లాడితే తెలంగాణ ప్రజలు కచ్చితంగా అశ్వీరదిస్తారని అందెశ్రీ తనతో చెప్పారని, తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడానికి కలిసి పనిచేద్దామని అన్నారని గుర్తుచేసుకున్నారు. చదువుకోవడానికి పట్నం వచ్చిన తమ్ముడి దగ్గరకు ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూసేందుకు వచ్చినట్లు కలిగే అనుభూతి తనకు అందెశ్రీతో మాట్లాడుతున్నప్పుడు కలిగేదని చెప్పారు. పేదలకు ప్రయోజనాలు చేకూర్చాలనే తన ఆలోచనకు గద్దర్‌ అన్న స్థాయిలో స్ఫూర్తిని అందెశ్రీ ఇచ్చారని పేర్కొన్నారు. అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణను పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణ ఉన్నంత కాలం రాష్ట్ర సాధనంలో అందెశ్రీ కృషిని శ్వాశతం చేసేందుకు ఆయన రచనలను గ్రంథస్తం చేస్తామని చెప్పారు. అందెశ్రీ పేరును గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీకి సిఫారసు చేసినా రాలేదని, ఈ ఏడాది కూడా మళ్లీ సిఫారసు చేస్తామని చెప్పారు. ఆయనకు పద్మశ్రీ ఇచ్చేందుకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సహకరించాలని సీఎం విజ్ఙప్తి చేశారు. అందెశ్రీ రచించిన నిప్పులవాగు పుస్తకం యువకులకు భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌తో సమానం అని పేర్కొన్నారు. తెలంగాణ సమస్యలపై పోరాటం చేసేవారికి ఈ పుస్తకం ఒక గైడ్‌ లాగా పనిచేస్తుందన్నారు. అందెశ్రీ రచించిన నిప్పులవాగు పుస్తకాన్ని 20 వేల కాపీలతో తెలంగాణలోని ప్రతితండాల్లో, గ్రామాల్లోని అన్ని గ్రంథాలయాల్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందెశ్రీ కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. అందెశ్రీ అంత్యక్రియల్లో విమలక్క, పాశం యాదగిరి, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

స్మృతి వనంగా అవుటర్‌ జంక్షన్‌

అందెశ్రీ అంత్యక్రియల కోసం అధికార యం త్రాంగం ఘట్‌కేసర్‌లోని ఔటర్‌ జంక్షన్‌ను ఎంపిక చేసింది. అంత్యక్రియలు నిర్వహించిన ఔటర్‌ జంక్షన్‌ స్థలాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు లాలాపేట్‌లోని అందెశ్రీ ఇంటి నుంచి ప్రత్యేక వాహనంలో పార్థివదేహాన్ని ఉదయం 10:40 గంటలకు ఘట్‌కేసర్‌లోని అందెశ్రీ నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 10 నిమిషాల పాటు ఉంచారు. తర్వాత ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర మొదలై అంత్యక్రియల స్థలికి చేరుకుంది.

Updated Date - Nov 12 , 2025 | 02:42 AM