Toll Free Travel for Sankranti Travelers: సంక్రాంతికి టోల్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ?
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:38 AM
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తీపికబురు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్‌చార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.
పండక్కి ఊర్లకెళ్లే వాహనాలకు టోల్ చార్జీలను
భరించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తీపికబురు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్‌చార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్‌జామ్‌ల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సర్కారు నిర్ణయానికి కేంద్రం అనుమతిస్తే.. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, విజయవాడవైపు వెళ్లే ప్రయాణికులకు భారీగా ఊరట కలగనుంది. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర హైవేలన్నింటితో పోలిస్తే.. హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్-65) హైవేపై తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే.. పండగ వేళ హైవేలపై ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలికి, ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేందుకు ప్రభుత్వం ఈ యోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. కాబట్టి.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల టోల్‌చార్జీలను తామే చెల్లిస్తామని., అందుకు అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయనున్నట్టు తెలిసింది.