Share News

Future City: మూడేళ్లలో గ్లోబల్‌ సిటీ!

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:50 AM

కోర్‌ అర్బన్‌ రీజియన్‌.. ఫ్యూచర్‌ సిటీ.. మూసీ అభివృద్ధి.. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలు.. రాబోయే రోజుల్లో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులూ వచ్చేది ఇక్కడికే...

Future City: మూడేళ్లలో గ్లోబల్‌ సిటీ!

  • ఫ్యూచర్‌ సిటీని ఓ కొలిక్కి తీసుకు రావడమే లక్ష్యం

  • పరిశ్రమల ఆకర్షణ, పెట్టుబడుల సమీకరణ ముఖ్యం.. జాప్యం లేకుండా ప్రణాళికలన్నీ అమలు కావడంపైనే దృష్టి

  • హిల్ట్‌ పాలసీని సమర్థంగా అమలు చేయడమూ కీలకమే.. అందుకే ఆ రంగంలో సమర్థుడైన జయేశ్‌కు బాధ్యత

  • గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో పెట్టుబడుల సమీకరణలో పాత్ర.. డెవలపర్లు, ప్రభుత్వం మధ్య సమన్వయానికీ ముఖ్యం

హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): కోర్‌ అర్బన్‌ రీజియన్‌.. ఫ్యూచర్‌ సిటీ.. మూసీ అభివృద్ధి.. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలు.. రాబోయే రోజుల్లో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులూ వచ్చేది ఇక్కడికే! ఇది ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మానస పుత్రిక కూడా! దీనిని నాలుగో, గ్లోబల్‌ సిటీగా మార్చాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే మూడేళ్లలోనే దీనిని ఓ కొలిక్కి తీసుకు రావాలనీ పావులు కదుపుతున్నారు. అందుకే, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల్లో పని చేసి గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలోనూ, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. శివారు మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతి పెద్ద నగరంగా మారిన మెగా హైదరాబాద్‌ అభివృద్ధి బాధ్యతను ఆయనకు ఇచ్చారు. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులను రాబట్టేందుకు రాబోయే మూడేళ్లు అత్యంత కీలకం కావడంతో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేనా.. భవిష్యత్తులో పాలనపరంగానూ ఇది అత్యంత శక్తిమంతమైన ప్రాంతం కానుంది. ఈ నేపథ్యంలోనే, విధాన నిర్ణయాల్లో జాప్యం లేకుండా ఉండడమే కాకుండా అభివృద్ధి పనుల పర్యవేక్షణకు, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునేందుకు సమర్థులైన అధికారులను నియమించాలని ప్రభుత్వం భావించింది. అందుకే, పరిశ్రమలను ఆకర్షించడం, పెట్టుబడులను రాబట్టడంలో అనుభవజ్ఞుడైన జయేశ్‌ రంజన్‌ను అందుకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లోపే నాలుగో సిటీ నిర్మాణం కావాలంటే కోర్‌ అర్బన్‌ పరిధిలో ప్రభుత్వం అనుకున్న ప్రణాళికలను అత్యంత వేగంగా అమలు చేయాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనది పెట్టుబడుల సమీకరణ. కంపెనీలు, పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తాయి. ఉపాధి పెరుగుతుంది. వ్యాపారం, వాణిజ్యంతో అభివృద్ధి శరవేగంగా దూసుకెళుతుంది. తద్వారా ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుంది.


జాప్యం లేకుండా ఇవన్నీ జరగాలంటే పెట్టుబడులు రావాలి. అందుకే, సుదీర్ఘ కాలంగా పరిశ్రమల శాఖలో పని చేసిన అనుభవం.. ఐటీ విభాగంపై పట్టు ఉన్న నేపథ్యంలో ప్రపంచ స్థాయి స్మార్ట్‌ సిటీగా కోర్‌ అర్బన్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు జయేశ్‌ సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఓఆర్‌ఆర్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి ప్రణాళికలను ఇటీవల గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, ఓఆర్‌ఆర్‌ అవతల హిల్ట్‌ పాలసీని సమర్థంగా అమలు చేయాల్సి ఉంది. అందుకే, పరిశ్రమల శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారి కావాలనే ఉద్దేశంతో జయేశ్‌ రంజన్‌ను ఎంపిక చేసిందని వివరించాయి. ఇక, పట్టణాభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు తీసుకురావాలంటే ముఖ్య కార్యదర్శి, ఆపై స్థాయి అధికారి ఉండాల్సిందేనని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. కార్యదర్శి హోదాలో ఉన్న అధికారిని నోడల్‌ అధికారిగా కేంద్రం గుర్తించదని, అందుకు సీనియర్‌ అధికారి అవసరమున్నందున జయేశ్‌ రంజన్‌ను నియమించినట్లు చెబుతున్నారు.

అన్నింటికి ఇదే కేంద్ర బిందువు

కేవలం పాలనాపరమైన నిర్ణయాలే కాకుండా విధాన రూపకల్పన, బడ్జెట్‌ కేటాయింపులు, నగరాభివృద్ధి వ్యూహాల అమలు, అధికార యంత్రాంగంపై నియంత్రణకు కేంద్ర బిందువుగా మెట్రోపాలిటన్‌, పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పని చేయాల్సి ఉంటుంది. ఈ స్థాయి అధికారి ఉంటే నేరుగా మంత్రివర్గానికి, సీఎంకు జవాబుదారిగా ఉంటారు. తద్వారా పాలనాపరమైన నిర్ణయాల్లో జాప్యం తగ్గే అవకాశం ఉంటుంది. పట్టణ విధానాల రూపకల్పన, నగర విస్తరణ, మాస్టర్‌ ప్లాన్‌ తయారీ, జోనల్‌ అభివృద్ధి ప్రణాళికల ఆమోదం, నిధుల వినియోగం తదితరాలను నేరు గా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. అలాగే, ప్రైవేటు డెవలపర్లకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయానికి ఈ పోస్టు కీలకం కానుందనే ప్రచారం కూడా ఉంది. భారీ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తీసుకునేందుకు, ఫ్లై ఓవర్లు, డ్రైనేజ్‌ ప్రాజెక్టులు, భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు, స్మార్ట్‌ సిటీ పనులకు పాలనా పరమైన ఆదేశాల్లో జాప్యం ఉండదనే వాదన కూడా ఉంది. పీపీపీ నమూనా ప్రాజెక్టులు, రియల్‌ ఎస్టేట్‌, పట్టణ మౌలిక వసతుల కల్పనలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని, డిజిటలైజేషన్‌, ఆన్‌లైన్‌ అనుమతులు వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని చెబుతున్నారు. జీవోలు, ఉత్తర్వుల జారీకి, పురపాలక చట్టాల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు, అధికారుల నియామకాలు, శాఖాపరమైన అన్ని అంశాల్లో సత్వరమే నిర్ణయాలు తీసుకునేందుకు ఒక కమాండర్‌లా పని చేయాల్సి ఉంటుందని, అందుకే సర్కారు జయేశ్‌ను ఎంపిక చేసుకుందని పురపాలక శాఖ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Dec 27 , 2025 | 06:01 AM