Agros: ఆగ్రోస్, డీసీఎమ్మె్‌సలు కనుమరుగు!
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:54 AM
వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉండి గుదిబండలా మారిన కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే చర్యల్లో భాగంగా కొన్నింటి విలీనం...
వీటి అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
హాకా, సీడ్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్ తదితర కార్పొరేషన్ల విలీనానికి ప్రాథమిక నిర్ణయం
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉండి గుదిబండలా మారిన కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే చర్యల్లో భాగంగా కొన్నింటి విలీనం, అవసరంలేనివాటి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(ఆగ్రోస్), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు(డీసీఎమ్మె్‌సలు) కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ అథారిటీ, మార్క్‌ఫెడ్, వేర్‌హౌసింగ్, హైదరాబాద్ వ్యవసాయ సహకార సంస్థ (హాకా) తదితర కార్పొరేషన్లను విలీనం చేయాలని ప్రాథమికంగా విలీన ప్రక్రియకు ప్రతిపాదనలు పంపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల అధికారులను ఆదేశించారు. ఆ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, డైరెక్టర్ బి.గోపిలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల కొనుగోళ్లు, వ్యవసాయ పనిముట్ల పంపిణీ తదితరాలకోసం ఆగ్రో్‌సను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ పనులన్నీ ప్రస్తుతం వ్యవసాయశాఖ ద్వారా చేపడుతున్నారు. దీంతో ఆగ్రోస్ అవసరం పెద్దగా లేకుండా పోయింది. మరోవైపు నామినేటెడ్ చైర్మన్ పదవికి ఇదొక రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. వ్యవసాయ, సహకారశాఖల అధికారులు కూడా డిప్యుటేషన్‌పై ఈ సంస్థలో చేరి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌తోపాటు వ్యవసాయ, అనుబంధ శాఖల్లో టెండర్లు, పెట్రోలు బంకుల నిర్వహణ, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు యంత్ర పరికరాల పంపిణీ తదితర వ్యవహారాలు.. అధికారులు, పాలకవర్గాలకు ఆదాయ వనరులుగా మారాయి. ఆగ్రోస్ నిర్వహించే టెండర్లు ఏటా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆగ్రో్‌సకు హైదరాబాద్‌లోని మౌలాలిలో ఉన్న 25 ఎకరాలు, చింతల్‌లోని భూములు, బెల్లంపల్లిలోని 400 ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోమంత్రి తుమ్మల ఆగ్రోస్ మూసివేత సహా ఇతర కార్పొరేషన్లను విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోందని, వ్యవసాయశాఖకు ఇవి భారంగా ఉన్నాయని, సాధ్యమైన వాటిని వ్యవసాయశాఖలో విలీనంచేసి మిగిలినవాటిని ఒక్క కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనే తలంపుతో పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయితే కొందరు అధికారులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు, ప్రతిపాదనలు రూపొందించేందుకు అడ్డుపడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు(డీసీఎమ్మెస్) ఉన్నాయి. వీటి మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో 1987లో డీసీఎమ్మె్‌సలు ఏర్పాటు చేసి జిల్లాకో కార్యాలయం, గోదాములు నిర్మించారు. మొదట్లో విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల కొనుగోళ్లు చేపట్టేవారు. ఆ తర్వాత పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. మార్క్‌ఫెడ్...మక్కలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు కొంటోంది. దీంతో డీసీఎంఎ్‌సల అవసరం ఏమాత్రం లేకుండాపోయింది. డీసీఎమ్మె్‌సలకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం, గౌరవ వేతనం, వాహనాలు, ఇంటి అద్దెలు తదితరాలు చెల్లిస్తుండటంతో నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలమేరకు డీసీఎమ్మె్‌సల మూసివేతకు రాష్ట్ర సహకారశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తోంది.