Share News

Telangana Education: విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌!

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:31 AM

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. అందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా...

Telangana Education: విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌!

  • సమీకృత గురుకులాలకు రూ.21వేల కోట్లు

  • ఉన్నత స్థాయి, టెక్నికల్‌, డిజిటల్‌ విద్య కోసంమరో రూ.9 వేల కోట్లు అవసరం

  • మొత్తం రూ.30 వేల కోట్ల రుణాలకు సర్కారు ప్లాన్‌

  • దీనికోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం

  • ఈ రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ఏర్పాట్లు

  • కార్పొరేషన్‌కు కేంద్రం ఆమోదిస్తే అసెంబ్లీలో బిల్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. అందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఆ నిధులతో అంగన్‌వాడీల (ప్రీ-ప్రైమరీ) నుంచి ఉన్నత, సాంకేతిక విద్య వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాల కోసం రూ.21 వేల కోట్లు, ఉన్నత, సాంకేతిక, డిజిటల్‌ విద్య కోసం రూ.9 వేల కోట్లు కలిపి రూ.30వేల కోట్ల వరకు నిధులు అవసరమని తేల్చింది. ఈ నిధుల సేకరణ కోసం, ఆ రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ఉండటం కోసం ‘ప్రత్యేక కార్పొరేషన్‌’ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఉన్న నియమ, నిబంధనలు, రాబడి, ఖర్చు, తిరిగి చెల్లింపులు ఎలా ఉంటాయనే వివరాలతో కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించి.. ఆమోదం రాగానే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. కార్పొరేషన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఆమోదించాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఆ భూములన్నీ కొత్త కార్పొరేషన్‌కు బదిలీ..

కొత్తగా కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి, రుణాలు సేకరించాలంటే.. దాని కింద ఉన్న భూములు, ఆదాయ మార్గాలను కూడా చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రస్తుతం సమీకృత గురుకులాల కోసం సేకరిస్తున్న భూములన్నింటినీ కార్పొరేషన్‌ భూములుగా చూపించనున్నారు. ఒక్కో గురుకులం కోసం 20-25 ఎకరాలను సేకరిస్తున్నారు. ఆ భూములను ప్రత్యేక కార్పొరేషన్‌ ఆస్తిగా మార్చి, రుణాల కోసం తనఖా పెడతారు. ఈ రుణాలను తిరిగి చెల్లించే అంశంలో పక్కాగా వ్యవహరించాలని, నిపుణుల సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమీకృత గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల ఉన్నతీకరణతో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశాలన్నీ వివరించారని, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు అనుమతించాలని కోరినట్టు తెలిసింది.


గత ప్రభుత్వంలో ఆస్పత్రుల కోసం కార్పొరేషన్‌..

భారీ నిర్మాణాలు, ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు రుణాల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్ప్పొరేషన్లను ఏర్పాటు చేయడం సాధారణమే. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టిమ్స్‌ ఆస్పత్రులు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, నిమ్స్‌ విస్తరణ కోసం ‘సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ కార్పొరేషన్‌’ను ఏర్పాటు చేసింది. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనుంది. సమీకృత గురుకులాల నిర్మాణం, టీచర్లకు శిక్షణ, పాఠశాల, ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాల కోసం ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకు (ఏడీబీ), ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ)ల నుంచి రూ.15,396 కోట్లను రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు ఇతర బ్యాంకుల నుంచి కూడా కొంతమొత్తంలో రుణాల సేకరణకు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Sep 17 , 2025 | 05:31 AM