Telangana Electricity: ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ల..పరపతి పెంచేందుకే కొత్త డిస్కమ్!
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:35 AM
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలైస ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ల పరపతి పెంచడానికే కొత్త డిస్కమ్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలకే పాత డిస్కమ్‌లు
కొత్త డిస్కమ్‌కు 28.90 లక్షల కనెక్షన్ల బదలాయింపు
రూ.71,964 కోట్ల అప్పులు, బాకీలు, కరెంట్ కొనుగోళ్ల బకాయిలు కూడా..
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలైస ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ల పరపతి పెంచడానికే కొత్త డిస్కమ్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరెంట్ కొనుగోళ్ల రూపేణా భారీగా పేరుకుపోయిన బకాయిలు, కరెంట్ సరఫరా చేసినా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వసూలు చేసుకోలేని మొండి బకాయిలు, రోజురోజుకూ పెరుగుతున్న అప్పులు పాత డిస్కమ్‌లకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త డిస్కమ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, ప్రభుత్వ పథకాల కోసమే దీనిని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించగా.. ఆ మేరకు కొత్త డిస్కమ్‌కు రూపునిచ్చే పనిలో ఇంధన శాఖ నిమగ్నమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సమావేశాలు జరగ్గా.. రానున్న అక్టోబరులో మరోమారు ఈ అంశంపై సీఎం సమీక్షించనున్నారు. ఆ తర్వాత మంత్రివర్గంలో చర్చించిన అనంతరం కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో డిస్కమ్‌కు అవసరమైన లైసెన్సును ప్రభుత్వం పొందనుంది. ఇక ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ను పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలకే పరిమితం చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న డిస్కమ్‌కు రెండు డిస్కమ్‌ల పరిధిలో ఉన్న 28,90,686 కనెక్షన్లను బదలాయించనున్నారు. వీటిలో వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్న 28,89,921 పంపుసెట్లతో పాటు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాల పంపులకు సంబంధించిన 429 కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై సీవరేజీ బోర్డు(వాటర్ బోర్డు)కు చెందిన 60 కనెక్షన్లు, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ(ఆర్‌డబ్ల్యూఎస్- మిషన్ భగీరథ)కు సంబంధించి 276 కనెక్షన్లు కొత్త డిస్కమ్ పరిధిలోకి రానున్నాయి. ఈ కనెక్షన్లకు విద్యుత్‌ను సరఫరా చేసే పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్)లకు స్మార్ట్ మీటర్లు బిగించనున్నారు. అన్ని డీటీఆర్‌ల నుంచి ఎంత విద్యుత్ సరఫరా అవుతుందనే సమాచారం ఆన్‌లైన్‌లోనే రికార్డు కానుంది.
భారీగా బాకీల్లో రెండు డిస్కమ్‌లు
రాష్ట్ర జెన్‌కోలకు గత జూలై 31వ తేదీ నాటికి రెండు డిస్కమ్‌లు(ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)లు కలిపి రూ.26,950 కోట్లు చెల్లింపులుచేయాల్సి ఉంది. అంతే కాకుండా కేంద్రప్రభుత్వ సంస్థలకు రూ.2,466 కోట్లు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్లు(ఐపీపీ)లకు రూ.2281 కోట్ల చెల్లింపులు డిస్కమ్‌లు చేయా ల్సి ఉంది. ఇందులో రూ.26,950 కోట్లు రాష్ట్ర జెన్‌కోల నుంచి కరెంట్ కొనుగోలు చేసిన బకాయిలను కొత్త డిస్కమ్‌కు బదలాయించనున్నారు. ఇక వివిధ ప్రభు త్వ శాఖలు డిస్కమ్‌లకు రూ.45,398 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ వినియోగిస్తున్నా ప్రభుత్వ శాఖలు బిల్లులు కట్టడం లేదు. నీటిపారుదలశాఖకు చెందిన ఎత్తిపోతల పథకాల వాటానే ఇందులో రూ.22,926 కోట్లు ఉండగా.. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఏకంగా రూ.7084 కోట్లు, మిషన్ భగీరథ కింద రూ.5972 కోట్లు బిల్లులు డిస్కమ్‌లకు రావాల్సిఉంది. ఇవీ కాకుండా పురపాలకశాఖ రూ.2383 కోట్లు, కేంద్రప్రభుత్వరంగ సంస్థలు రూ.909 కోట్లు, ఇతర ప్రభుత్వ శాఖలు రూ.459 కోట్లు, పంచాయతీరాజ్/గ్రామీణాభివృద్ధి శాఖ కూడా రూ.5665 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కలుపుకొని రూ.45,398 కోట్లు ఉండగా.. అందులో ప్రధానం గా ఎత్తిపోతల పథకాలకుచెందిన రూ.22,926 కోట్లు, వాటర్‌బోర్డుకు చెందిన రూ.7084 కోట్లు, మిషన్ భగీరథకు చెందిన రూ.5972 కోట్లు కలుపుకొని రూ.35,982 కోట్లను కొత్తగా ఏర్పడనున్న డిస్కమ్‌ల ఖాతాలో వేయనున్నారు. ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సి ఉన్న రూ.35,982 కోట్లతో పాటు రెండు డిస్కమ్‌లకు చెందిన రుణంలో కొంత రూ.9032 కోట్లు, ఇక జెన్‌కోలకు డిస్కమ్‌లు కట్టాల్సిన కరెంట్ బకాయిలు రూ.26,950 కోట్లను కొత్త డిస్కమ్‌కు బదలాయించనున్నారు. మొత్తం రూ.71,964 కోట్ల కరెంట్ బిల్లులు, కరెంట్ కొనుగోలు చెల్లింపుల బకాయిలు, రుణాలు కొత్త డిస్కమ్‌కు చేరనున్నాయి. ఇక కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి కొన్నేళ్లుగా డిస్కమ్‌ల కు రేటింగ్ ఇస్తుండగా.. అన్నింట్లోనూ తెలంగాణ డిస్కమ్‌లు ఆర్థికంగా అట్టడుగు స్థానంలో రేటింగ్‌లు పొందుతున్నాయి. ప్రభుత్వ పథకాల కోసం ప్రత్యేక డిస్కమ్ పెడితేనే.. డిస్కమ్‌ల ఆర్థిక పరపతి పెరిగే అవకాశముంది. ఇప్పటికే పొందిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకొని తక్కువ వడ్డీ తో.. మళ్లీ రుణాలు పొందాలని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లు యోచిస్తున్నాయి. పరపతి పెరిగితే వడ్డీలో రాయితీ కూడా పెరుగుతుందనే భరోసాతో ఉన్నాయి.
2 వేల మందితో కొత్త డిస్కమ్
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ), డైరెక్టర్లతో పాటు ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు, 10 మంది సూపరింటెండెంట్ ఇంజనీర్లు, 38 మంది డివిజనల్ ఇంజనీర్లు, 90 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, 520 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు/సబ్ ఇంజనీర్లు, 1000మంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో పాటు/ఆర్టిజన్లు, 340 మంది అకౌంట్స్, పరిపాలన సిబ్బంది కలుపుకొని 2 వేల మంది కొత్త డిస్కమ్‌కు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది.