Local Body Polls: పార్టీపరంగా 42శాతం
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:05 AM
బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది...
స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం!
కోర్టు తీర్పుల నేపథ్యంలో పునరాలోచన
న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు
ఎన్నికలకు వెళ్లడానికే మెజారిటీ మంత్రుల ఓటు
19న టీపీసీసీ పీఏసీ భేటీ.. తుది నిర్ణయం
23న మళ్లీ క్యాబినెట్.. అధికారిక ప్రకటన!?
సుప్రీంకోర్టు ఆదేశాల వివరాలు అందాక నిర్ణయం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై రానున్న రెండు రోజులు న్యాయ నిపుణులతో చర్చించి.. వారి సూచనలు తీసుకోనుంది. ఈనెల 19న గాంధీ భవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించి.. అందులో ఈ అంశంపై చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. ఈ మేరకు సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. పాత రిజర్వేషన్ల పద్ధతితోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జీవో 9పై స్టే విధించిన సందర్భంగా హైకోర్టు.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ సుప్రీం కోర్టు స్పష్టం చేసిన అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలు రెండూ పాత రిజర్వేషన్‌తోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలో.. ఆ ప్రకారమే ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న చర్చ చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికలు ఆలస్యం కావడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు పెండింగ్‌లో పడుతున్నాయని, స్థానిక పాలన కూడా కుంటుపడుతోందన్న చర్చ జరిగింది. న్యాయ పోరాటంలో ఫలితం తేలడానికి మరింత సమయం పట్టేందుకూ ఆస్కారం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించి.. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. మెజారిటీ మంత్రులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. కొద్దిమంది మాత్రం బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు సాధించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో.. కేసు వాదించిన సీనియర్ న్యాయవాదులు, ఇతర న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహా మేరకు ముందుకు వెళ్లాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఆదివారం టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ నిర్వహించి.. అందులో తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. అనంతరం, ఈనెల 23వ తేదీనే మరోసారి క్యాబినెట్ సమావేశం కానుంది. అందులో చర్చించి దీనిపై అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇప్పటి వరకు జరిగిన పార్టీ కమిటీ సమావేశాలన్నింటిలోనూ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాలని మెజార్టీ నేతలు అభిప్రాయ పడిన నేపథ్యంలో.. ఆదివారం జరగనున్న పీఏసీ భేటీలో నిర్ణయం లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీసీ కోటాపై ‘సుప్రీం’ నుంచి వివరాలు అందాక నిర్ణయం: పొంగులేటి
బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వేసిందని, అయితే.. దానిని సుప్రీం కోర్టు కొట్టివేసిందని, కానీ.. పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇంకా అందలేదని, కోర్టు నుంచి పూర్తి వివరాలు అందిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని గురువారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కోర్టు కామెంట్లు చూసిన తర్వాత, న్యాయపరంగా, మిగతా సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా.. ఈనెల 23న మరోసారి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అందులో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు.