Hyderabad Metro for Seamless Expansion: మెట్రో త్వరగా స్వాధీనం కావాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:30 AM
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశకు రెండో దశను అనుసంధానం చేయడం ద్వారానే సజావుగా ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది...
సంప్రదింపులు, బదిలీ ప్రక్రియను వేగంగా చేపట్టండి
మొదటి, రెండో దశల అనుసంధానంతోనే.. పనులు వేగంగా జరిగే అవకాశం: సీఎం రేవంత్
ఎన్వీఎస్ రెడ్డి, సర్ఫరాజ్ అహ్మద్‌తో సీఎం భేటీ
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశకు రెండో దశను అనుసంధానం చేయడం ద్వారానే సజావుగా ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతా ఒకే గొడుగు కిందికి వస్తే.. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు చేసే అవకాశం ఉంటుందనే మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవటానికి కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రభుత్వ సలహాదారులు ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌లతో సమీక్ష నిర్వహించారు. మెట్రో ప్రాజెక్టును వీలైనంత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి ఉన్న మార్గాలపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీపై రూ.13 వేల కోట్ల అప్పుల భారం పడటం, నిర్వహణ ఇబ్బందితో.. ప్రాజెక్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాను దృష్టిలో పెట్టుకొని మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. దీనితో రూ.13వేల కోట్ల అప్పులను కూడా ప్రభుత్వం బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను త్వరగా ముందుకు తీసుకెళ్లాలని, చర్చలు, బదిలీ ప్రక్రియ, ఒప్పందాలు త్వరగా పూర్తిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా, అప్పుల బదిలీతోపాటు తమకు రూ.5 వేల కోట్ల గుడ్‌విల్ ఇవ్వాలని ఎల్‌అండ్‌టీ డిమాండ్ చేస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే.. రూ.2 వేల కోట్ల వరకు ఇవ్వొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మెట్రో ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకుంటే... మెట్రోకు ఉన్న భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వ అదీనంలోకి వస్తాయి.