Greenfield Express Highway: 297 కిలోమీటర్లు.. 20 వేల కోట్లు!
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:36 AM
ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరుపోర్టు వరకు ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణానికి రూ.20వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా తేలింది....
ఫ్యూచర్‌సిటీ-బందరుపోర్టు గ్రీన్‌ఫీల్డ్ హైవే ఖర్చు అంచనా
రాష్ట్రంలో 88,799 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం
8 లేన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే: కోమటిరెడ్డి
హైదరాబాద్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరుపోర్టు వరకు ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణానికి రూ.20వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా తేలింది. మొత్తం 297 కిలో మీటర్ల మేర నిర్మించనున్న రోడ్డు అలైన్‌మెంట్, భూసేకరణ, పరిహారం, నిర్మాణ ఖర్చు తదితర అంశాలపై ప్రభుత్వం ఒక నివేదికను రూపొందించింది. తాజాగా గ్రీన్‌ఫీల్డ్ హైవేతోపాటు రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్ల వివరాలను తెలియజేస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోనుందని తెలిపారు. రూ.8వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం దాకా 52 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలు తుది దశకు చేరాయని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో రూ.88,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతుండగా, వీటిలో ఇప్పటికే రూ.60,799కోట్లతో పలు రోడ్ల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మరో రూ.28వేల కోట్లతో చేపట్టనున్న రోడ్ల పనులు ప్రతిపాదనల దశలో ఉన్నాయన్నారు. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో బహుళజాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారుతోందని, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని కొంతమేర 8 లేన్లుగా, కొంత మేర 6 లేన్లుగా విస్తరించనున్నామని తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణాల కోసం రూ.36వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. జాతీయ రహదారుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేయడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని వివరించారు.