Share News

Oath Ceremony: పల్లె పాలన షురూ

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:24 AM

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు....

Oath Ceremony: పల్లె పాలన షురూ

  • సర్పంచ్‌, ఉప సర్పంచ్‌.. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

  • ప్రజాప్రతినిధులకు సీతక్క శుభాకాంక్షలు

హైదరాబాద్‌/జనగామ రూరల్‌/పూడూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,702 మంది సర్పంచ్‌లు, 12,702 మంది ఉప సర్పంచ్‌లు, 1,11,803 మంది వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లుగా పంచాయతీల పరిధిలో ఖాళీగా ఉన్న సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఇటీవల మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల మేరకు ఆయా స్థానాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 1,205 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మూడు విడతల్లో 11,497 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 25,848 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 85,955 స్థానాలకు ఎన్నికలు చేపట్టారు. దీంతో ఒకరిద్దరు తప్ప.. మొత్తంగా 12,702 మంది సర్పంచ్‌లు, 12,702 మంది ఉపసర్పంచ్‌లు, 1,11,803 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమష్టిగా పని చేస్తేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

అంబులెన్స్‌లో వచ్చి.. సర్పంచ్‌గా ప్రమాణం

అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఓ సర్పంచ్‌.. అంబులెన్స్‌లో వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. జనగామ జిల్లా జనగామ మండలం వెంకిర్యాలలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈర్ల అలేఖ్య సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే, ఎన్నికల ప్రచారంలోనే అస్వస్థతకు గురైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అలేఖ్య కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. సోమవారం ప్రమాణ స్వీకారం ఉండటంతో అలేఖ్య ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో గ్రామానికి వచ్చారు. వాహనంలోనే ఉండి సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు.


పంచాయతీ కరదీపిక ఆవిష్కరణ..

పంచాయతీ ప్రజా ప్రతినిధుల విధులు, బాధ్యతలు, వారు చేపట్టాల్సిన కార్యక్రమాలపై రూపొందించిన కరదీపికను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం తన నివాసంలో ఆవిష్కరించారు. పంచాయతీరాజ్‌ చట్టం-2018, గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(టీజీఐఆర్‌డీ) 292 పేజీల పుస్తకాన్ని రూపొందించింది. ఈ కరదీపికను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్రామ ప్రజాప్రతినిధులకు అందజేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విజయోత్సవ ర్యాలీలో కారు ఢీ.. చిన్నారి మృతి

సర్పంచ్‌ విజయోత్సవ ర్యాలీలో కారు కింద పడి ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల సర్పంచ్‌ కమ్లీబాయి పెంటయ్య సోమవారం రాత్రి గ్రామంలో విజయయోత్సవ ర్యాలీ తీశారు. గ్రామానికి చెందిన కుర్వ నర్సింహులు, లావణ్య దంపతులు తమ కూతురు సౌజన్య(7)తో కలిసి రోడ్డు పక్కన ఉండి ర్యాలీని చూస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌ సమీప బంధువైన ప్రశాంత్‌ అజాగ్రత్తగా కారు నడిపి రోడ్డు పక్కన ఉన్న బాలికను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలిక మృతి చెందింది. దీంతో పెంటయ్య, గ్రామస్థుల మధ్య గొడవతో ఊళ్లో ఉద్రిక్తత నెలకొంది. కారు డ్రైవర్‌ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పరిగి నుంచి వస్తున్న వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిందని ఎస్‌ఐ భరత్‌ చెప్పడంతో గ్రామస్థులు భగ్గుమన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 04:24 AM