Share News

Telangana Panchayat Polls: 5 ఏళ్ల వయసులో.. జగదీశ్‌రెడ్డి తండ్రి గెలుపు

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:43 AM

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆయన వయసు .....

Telangana Panchayat Polls: 5 ఏళ్ల వయసులో.. జగదీశ్‌రెడ్డి తండ్రి గెలుపు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆయన వయసు 95 ఏళ్లుకావడం గమనార్హం. గ్రామంలోని వార్డులన్నీ బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుచుకున్నారు.

1.jpg

‘విధి’ ఓడించింది.. ఓటు గెలిపించింది!

రాజన్న సిరిసిల్ల వేములవాడ మండలం చింతల్‌ఠాణా సర్పంచ్‌గా ఇటీవల గుండెపోటుతో మరణించిన శేర్ల మురళి (బీఆర్‌ఎస్‌) గెలుపొందారు. ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసిన ఆయన.. ఈ నెల 5న మృతిచెందారు. గురువారం ఓట్ల లెక్కింపులో 400 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉండగా.. అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. తిరిగి ఎన్నికలు నిర్వహించాలా, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించాలా అన్నదానిపై ఎన్నికల కమిషన్‌ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

1.jpg

తల్లిపై బిడ్డ.. అన్నపై చెల్లెలు విజయం

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో పాలెపు సుమలత తన తల్లి గంగవ్వపై 91 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఇదే మండలం గుమ్లాపూర్‌లో రావుట్ల స్రవంతి తన అన్న తెడ్డు శివకుమార్‌పై 61 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచారు.

2.jpg

గెలుపు, ఓటమి.. విషాదం!

  • నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం రానంపల్లి సర్పంచ్‌గా కొండల్‌వాడి శంకర్‌ విజయం సాధించారు. తన కుమారుడి గెలుపుపై ఆనందంతో చుట్టుపక్కల వారితో మాట్లాడుతున్న ఆయన తల్లి లింగవ్వ (60) గుండెపోటుతో కన్నుమూశారు. గెలుపు ఆనందం తీరకముందే శంకర్‌ విషాదంలో మునిగిపోయారు.

  • పెద్దపల్లి జిల్లా మచ్చుపేటలోని 4వ వార్డు మెంబర్‌గా పోలుదాసు లత గెలిచారు. అయితే కుటుంబ కలహాలతో బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె భర్త శ్రీనివాస్‌ (35) ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ఆస్పత్రిలో మృతిచెందారు.

  • జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌లో పోతు శేఖర్‌ సర్పంచ్‌ పదవికి పోటీ చేశారు. ఆయన తరఫున సోదరి కొప్పుల మమత కోరుట్ల నుంచి వచ్చి విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేశారు. కానీ గురువారం ఓట్ల లెక్కింపు సమయంలో శేఖర్‌ వెనుకబడిపోవడంతో ఆందోళనతో గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

  • వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం ఖాజాఅహ్మద్‌పల్లిలో సర్పంచ్‌ పదవికి పోటీ చేసిన లక్ష్మి ఓటమి పాలవడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 04:43 AM