Panchayat Elections: 45 రోజుల్లో ఖర్చు వివరాలివ్వకపోతే పదవి పోతుంది
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:50 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు 45 రోజుల్లో తమ ఖర్చుల వివరాలను సమర్పించాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం...
తప్పుడు లెక్కలిచ్చినా కఠిన చర్యలు
పంచాయతీ అభ్యర్థులకు ఎస్‌ఈసీ హెచ్చరిక
85.3ు పోలింగ్ నమోదైనట్లు వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు 45 రోజుల్లో తమ ఖర్చుల వివరాలను సమర్పించాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హెచ్చరించింది. సరైన వివరాలివ్వకపోతే పదవులు కోల్పోతారని స్పష్టం చేసింది. అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చు వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌ఈసీ కార్యదర్శి మకరంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీచేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలను నిర్ణీత గడువులోగా సేకరించాలని ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారులు)లను ఆదేశించారు. అభ్యర్థులు సమర్పించిన వివరాలను పరిశీలించి, టీఈ -పోల్ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. నివేదికలను ఫిబ్రవరి 15లోపు ఎస్‌ఈసీకి పంపాలని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ నిబంధనల ప్రకారం 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లోని సర్పంచ్ అభ్యర్థి గరిష్ఠంగా రూ.1,50,000, వార్డు అభ్యర్థి రూ.30వేల వరకు ఖర్చుచేయాలని పేర్కొంది. 5వేలకు పైగా జనాభాఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్ఠంగా రూ.2,50,000, వార్డు అభ్యర్థి రూ.50వేల వరకు ఖర్చుచేయాలని నిర్ణయించింది. కాగా సర్పంచ్, వార్డుల స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను తొలివిడత ఎన్నికల్లో పాల్గొన్నవారు 2026 జనవరి 24వ తేదిలోపు, రెండో విడతలో పాల్గొన్నవారు జనవరి 27న, మూడోవిడతలో పాల్గొన్నవారు జనవరి 30వ తేదిలోపు ఎంపీడీవోలకు సమర్పించాలని తెలిపారు. గడువులోగా ఖర్చు వివరాలు ఇవ్వకున్నా.., తప్పుడు సమాచారం ఇచ్చినా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 23ప్రకారం.. గెలిచిన అభ్యర్థులు తమ పదవిని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరో మూడేళ్లవరకు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయకుండా నిషేధం కూడా విధిస్తామని వెల్లడించారు. కాగా, ఎన్నికల్లో విధుల్లో మరణించిన ఉద్యోగుల పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని సంతాపం తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, ఆసిఫాబాద్ మిషన్ భగీరథ ఏఈ కట్టరాజు విధుల్లోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాగా మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1205 సర్పంచ్, 25848 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, 11,497 సర్పంచు, 85955 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు చేపట్టినట్లు వెల్లడించారు. మూడుదశల 1,25,23,137 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, మొత్తం 85.30 శాతం పోలింగ్ జరిగినట్లు ఎస్‌ఈసీ వివరించారు.