Panchayat Elections: మూడో విడతకు 27, 277 నామినేషన్లు
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:47 AM
మూడో విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు గట్టిపోటీ నెలకొంది.
4,158 సర్పంచ్ స్థానాలు.. బరిలో సగటున ఆరుగురు.. 36,442 వార్డు మెంబర్ స్థానాలకు 89,604 నామినేషన్లు
ఉపసంహరణకు 9వ తేదీ తుది గడువు
అదే రోజు తుది జాబితా, 17న పోలింగ్
హైదరాబాద్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) : మూడో విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు గట్టిపోటీ నెలకొంది. ఈ విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల సమర్పణకు చివరి రోజైన శనివారం ఒక్కరోజే 17,407 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు 3,155, రెండో రోజు 6,715 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 6.56 మంది నామినేషన్లు సమర్పించారు. మొదటి విడత నామినేషన్ల సమయంలో ఒక్కో సర్పంచ్ స్థానానికి ఆరు నామినేషన్లు రాగా ఉపసంహరణ తర్వాత అది నాలుగుకి తగ్గింది. రెండో విడతలో ఒక్కో స్థానానికి సగటున 6.5 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణకు శనివారం చివరి రోజు. దీంతో రెండో విడత బరిలో ఎంతమంది ఉన్నారనే అంశంపై ఆదివారం పూర్తి స్పష్టత రానుంది. మరోపక్క, మూడో విడత ఎన్నికలు జరిగే 36,442 వార్డు మెంబర్ స్థానాలకు తొలిరోజు 5,424 రెండోరోజు 22,618, చివరి రోజు 61,562 కలిపి మొత్తం 89,604 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు శనివారం పరిశీలించారు. 7, 8తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ/పరిష్కారం, 9న నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అదే రోజున ప్రకటిస్తారు. మూడో విడత పంచాయతీ స్థానాలకు ఈనెల 17న పోలింగ్ జరగనుంది.
ఖమ్మంలో 22, ఇందూరులో 37 ఏకగ్రీవాలు
ఖమ్మం, నిజామాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖమ్మం జిల్లాలో 22 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 17 స్థానాలను కాంగ్రస్ దక్కించుకోగా సీపీఐ 3, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ 1, బీఆర్‌ఎ్‌సకు 1 దక్కాయి. తొలి విడతకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని మొత్తం 20 పంచాయతీలు ఏకగ్రీవం అవ్వగా అందులో 19 కాంగ్రెస్‌కే దక్కాయి. ఒకటి సీపీఐకి దక్కింది. రెండు విడతల్లో కలుపుకొని ఖమ్మం జిల్లాల్లో 42 పంచాయతీలు ఏకగ్రీవం అవ్వగా.. కాంగ్రెస్‌కు 36, సీపీఐ 4, మాస్‌లైన్ 1, బీఆర్‌ఎస్ 1 పంచాయతీని దక్కించుకున్నాయి. మూడో విడతకు సంబంధించిన ఏకగ్రీవాలకు గ్రామస్థాయి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్న 8 మండలాల్లో 37 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతకు సంబంధించి 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
పోటీలో మామా కోడళ్లు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరాంనగర్ సర్పంచ్ స్థానానికి గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సత్యనారాయణగౌడ్, ఆయన కుమారుడు శ్రీరామ్‌గౌడ్, కోడలు రాధిక నామినేషన్లు వేశారు. శ్రీరామ్‌గౌడ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా మరో ఇద్దరితో కలిసి మామాకోడళ్లు ప్రస్తుతం పోటీలో నిలిచారు.
నన్ను గెలిపిస్తే నా టెంట్ హౌస్ ఇచ్చేస్తా
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుడిగబోయిన శృతి ఓటర్లకు బాండ్ పేపర్‌పై రాసిచ్చిన హామీ పత్రమిది. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామానికి ఏం చేస్తానో ఆమె ఈ పత్రంలో పేర్కొన్నారు. సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజునే తన టెంట్ హౌస్‌ను పంచాయతీకి ఇచ్చేస్తానని, పేదింటి ఆడపిల్లల పెళ్లిక ఆర్థిక సాయం చేస్తానని, గ్రామంలో ఫలానా అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని, లేదంటే పదవి నుంచి తప్పుకుంటానని రాసిచ్చి ఆమె ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు - కేసముద్రం
సర్పంచ్ పదవి కోసం మతమార్పిడి
సుల్తానాబాద్, రాయికల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఓ మహిళ మతం మారారనే అంశం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి సర్పంచ్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ అయ్యింది. దీంతో గ్రామంలో ఎస్సీ వర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఒకరు తన భార్య చిలుక స్రవంతితో మతం మార్పించారు. స్రవంతి క్రైస్తవ మతంలో చేరినట్లు తగిన ఆధారాలతో కూడిన పత్రాలను సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి బీసీ సర్టిఫికెట్ పొందారు. ఆ సర్టిఫికెట్ సాయంతో చిలుక స్రవంతి నామినేషన్ వేయగా అధికారులు ఆమోదించారు. ఈ వ్యవహరంపై ఇతర అభ్యర్థులు, బీసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. చిలుక స్రవంతి నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్‌చార్జి తహసీల్దార్ గిరి మాట్లాడుతూ నిబంధనల మేరకే చిలుక స్రవంతికి బీసీ సర్టిఫికెట్ జారీ చేశానని, అభ్యంతరాలు ఉంటే ఎక్కడైనా అప్పీలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
కూతురు సర్పంచ్ తండ్రి ఉప సర్పంచ్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని జీపీ బొత్తలతండా సర్పంచ్, ఉపసర్పంచ్‌లుగా తండ్రీకూతుళ్లు ఎన్నికయ్యారు. జీపీ బొత్తలతండాలోని సర్పంచ్, నాలుగు వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన జాటోతు కల్పన సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె వార్డు సభ్యుల్లో ఒకరైన తన తండ్రి ఆంగుతో లచ్చిరామ్‌నాయక్‌ను ఇతర సభ్యుల మద్దతులో ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు
- పెద్దవంగర