Higher Education: వసతులు లేవు.. బోగస్ విద్యార్థులు
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:19 AM
రాష్ట్రంలోని అన్ని వృత్తివిద్యా కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కాలేజీలు...
ఫీజు రీయింబర్స్‌మెంట్ దుర్వినియోగంపై ఫిర్యాదులతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కళాశాలల్లో తనిఖీలు
ఆరోపణలు నిజమని తేలడంతో 1900 కాలేజీల్లో తనిఖీలకు ఆదేశం
నేడు ఇంజినీరింగ్ కాలేజీలతో మొదలు.. ఇది ప్రభుత్వ కక్ష సాధింపే..తనిఖీలకు సహకరించం: కళాశాలల యాజమాన్యాలు
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని వృత్తివిద్యా కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కాలేజీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ గతంలో వచ్చిన ఫిర్యాదులపై ఇటీవలే ప్రభుత్వం కొన్ని కాలేజీల్లో విచారణ జరిపింది. సరైన వసతులు లేకపోవడం, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం, కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు లేకపోవడం, బోగస్ విద్యార్థులు, అర్హతలేని అధ్యాపకులు ఉన్నట్లు తమ విచారణలో తేలిందని ప్రభుత్వం తెలిపింది. దీంతో, ఈ అంశాన్ని సమగ్రంగా విచారించాలని తాము నిర్ణయించామని.. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో విచారణకు ఆదేశిస్తున్నామని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. గతంలో విడుదల చేసిన నిధులు సైతం పక్కదారి పట్టాయని, పేద విద్యార్థులకు అందాల్సిన నిధులను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి నేతృత్వంలో విజిలెన్స్, పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో నోడల్ ఏజెన్సీగా ఉన్న సంక్షేమ శాఖలు, ఉన్నత విద్య, వర్సిటీల అధికారులు ఈ తనిఖీ బృందంలో ఉంటారు. వారు పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలు పొందుతున్న అన్ని కాలేజీలనూ తనిఖీ చేస్తారు. కాలేజీలు నిజంగా అనుమతుల ప్రకారం నడుస్తున్నాయా? స్కాలర్‌షిప్ పొందుతున్న విద్యార్థులు అందుకు అర్హులేనా? నిబంధనలకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారా? తరగతి గదులు, ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాలు ఉన్నాయా? విద్యార్థుల హాజరు, ఫలితాలు సరైనవేనా? విద్యార్థుల ఉత్తీర్ణత ఎంత? ఏవైనా ఇతర అవకతవకలు ఉన్నాయా? తదితర విషయాలను పరిశీలిస్తారు. ఈ తనిఖీల్లో ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ అధికారులు తప్పనిసరిగా భాగస్వాములుగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీస్ కమిషనరేట్లకు చెందిన పోలీసు అధికారులు కూడా ఈ తనిఖీల్లో భాగమవుతారు.
ఆ కాలేజీలతో..
రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హమైన వృత్తివిద్య కాలేజీలు దాదాపు 1900 ఉన్నాయి. ఇందులో డిగ్రీ కళాశాలలు 900 కాగా.. ఎంబీఎ-ఎంసీఎ కాలేజీలు 310, బీఈడీ కాలేజీలు 215, ఇంజినీరింగ్ 175, ఫార్మసీ 123, పాలిటెక్నిక్ 70, ఐటిఐ, లా, ఇతర కాలేజీలు మరో వంద వరకు ఉంటాయి. తొలుత ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలు పొందుతున్న కాలేజీల్లో జూనియర్ కాలేజీలూ ఉన్నాయి. వాటిని మినహాయించి.. డిగ్రీ, ఇతర వృత్తివిద్య కాలేజీల్లోనే తనిఖీలు నిర్వహించనున్నారు. ఇకనుంచి ఉన్నత విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ తనిఖీలకు సహకరించం: ఫాతీ
నాలుగేళ్లుగా బకాయిపడ్డ ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు అడిగినందునే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) పేర్కొంది. విచారణ జరిపించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ప్రతి విద్యార్థి వివరాలూ ఈ-పాస్ వెబ్‌సైట్లో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను ప్రభుత్వ అధికారులే ధ్రువీకరించారు. అయినా అవకతకవకలు జరుగుతున్నాయని చెప్పడం సరికాదు’’ అని ఫాతీ అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేశ్ బాబు ఆవేదన వెలిబుచ్చారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలు కొనసాగించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తుందని తమకు ముందే తెలుసని, ఈ విచారణకు అధికారులకు తాము సహకరించబోమని ఆయన స్పష్టం చేశారు. తాము గతంలో ప్రకటించిన విధంగా నవంబరు-3 నుంచి కాలేజీల నిరవధిక సమ్మె ఉంటుందని రమేశ్ బాబు పేర్కొన్నారు.