Irrigation Minister Uttam Kumar Reddy: బనకచర్లను అడ్డుకుంటాం
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:15 AM
ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపునూ ఒప్పుకోం.. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారే ఉన్నా రాజీపడబోం
కృష్ణా, గోదావరి జలాల్లో 70శాతం వాటా దక్కాల్సిందే
23వేల కోట్లతో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు
హరీశ్‌రావు అసత్య ప్రచారాలను మానుకోవాలి: ఉత్తమ్
హనుమకొండ సిటీ/ యాదాద్రి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్ర జల వనరులు, ప్రాజెక్టుల విషయమ్మీద కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవాలుగా కొట్టిపారేశారు. జల వనరుల్లో తెలంగాణ వాటాను దక్కించుకోవడంలో గానీ, సంరక్షణలో గానీ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపు ప్రతిపాదనలనూ సహించేది లేదని, కర్ణాటకలో తమ పార్టీనే అధికారంలో ఉన్నా ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని.. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టం చేశారు. నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డికి ఇటీవల మాతృవియోగం కలగడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉత్తమ్ శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చారు. యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. బనకచర్ల విషయమ్మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన అభ్యంతరాలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు లిఖపూర్వకంగా తెలియజేసిందని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపును అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకుంది అప్పటి బీఆర్‌ఎస్ సర్కారేనని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతుల సాధనలో ఉన్నట్లు చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు 65 టీఎంసీల నీటి కేటాయింపు ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. వాస్తవాలు కళ్లకు కట్టినట్లు ఉన్నా.. హరీశ్‌రావు రాజకీయ స్వార్థంతో కాంగ్రె్‌సపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలను హరీశ్ మానుకోవాలని.. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కృష్ణా, గోదావరి జలాశయాల నుంచి తెలంగాణకు దక్కాల్సిన 70 శాతం నీటి వాటను దక్కించుకుంటామని, ఈ మేరకు న్యాయబద్ధంగా పోరాడుతున్నట్లు చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒకేఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే.. అదీ కుప్పకూలిందని.. మేడిగడ్డ కూలడం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు బీటలు వారి నిరుపయోగంగా మారాయని విమర్శించారు. అయినా, ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో 148.5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రూ.23వేల కోట్లు వెచ్చించి 80లక్షల మెట్రిక్ టన్నుల ఽధాన్యం కొంటామని చెప్పారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభించినట్లు చెప్పారు. యాదాద్రి జిల్లాలోని బస్వాపూర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పునరావాసం మంజూరుకు కావాల్సిన నిధులపైనా సమీక్షించారు. గంధమల్ల రిజర్వాయర్, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.