Share News

Emergency response: యంత్రాంగం పనితీరు భేష్‌!

ABN , Publish Date - Nov 04 , 2025 | 03:03 AM

మీర్జాగూడ ఘోర రోడ్డు ప్రమాదం వార్త తెలియగానే సర్కారు అప్రమత్తమైంది. ఆగమేఘాల మీద ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టిన పోలీసు...

Emergency response: యంత్రాంగం పనితీరు భేష్‌!

  • చేవెళ్లకు డిప్యూటీ సీఎం సహా పలువురు మంత్రులు

  • సహాయక చర్యలపై స్థానికుల ప్రశంసలు

  • (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

మీర్జాగూడ ఘోర రోడ్డు ప్రమాదం వార్త తెలియగానే సర్కారు అప్రమత్తమైంది. ఆగమేఘాల మీద ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టిన పోలీసు, రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బంది, అధికార యంత్రాంగానికి స్థానికుల ప్రశంసలు లభించాయి. సీఎం రేవంత్‌ రెడ్డి వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడటంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులను ప్రమాద స్థలానికి పంపారు. హైదరాబాద్‌ నుంచి అంబులెన్సులు, ఇతర వైద్య సిబ్బందిని భారీగా తరలించారు. స్వల్ప గాయాలైన వారిని చేవెళ్లలోని మహేందర్‌ రెడ్డి వైద్య కళాశాల, వికారాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రులకు.. తీవ్ర గాయాల పాలైన వారిని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. బాధితులకు అవసరమైన అన్ని బ్లడ్‌ గ్రూపుల రక్తం సిద్ధం చేశారు. చేవెళ్లకు చేరుకున్న మంత్రులు బాధితులను పరామర్శించి.. మార్చురీకెళ్లి మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. మరోవైపు, ఉచిత బస్సు సౌకర్యం నేపథ్యంలో ఆధార్‌ కార్డుల సాయంతో మహిళా మృతులను అధికారులు గుర్తించారు. కానీ పురుషులు, కర్ణాటక మహిళ, ఆధార్‌ లేని మహిళను గుర్తించడం కష్టమైనా.. చివరకు వివిధశాఖల సమన్వయంతో గుర్తించి బాధితులకు అప్పగించారు. అయితే, ఎక్కువ మంది మృతులుండటంతో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం ఆలస్యమవుతుందని.. మృతదేహాలను ఉస్మానియాకు తరలించాలన్న అధికారుల యత్నాలపై స్థానిక ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. దీంతో క్షతగాత్రులకు చికిత్సతోపాటు మృతదేహాలకు చేవెళ్లలోనే పోస్టుమార్టం నిర్వహణకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌ నుంచి 46 వైద్య బృందాలను ఆగమేఘాలపై తరలించింది. చేవెళ్ల, ఉస్మానియా, తాండూరు, వికారాబాద్‌ బోధనాస్పత్రుల ఫోరెన్సిక్‌ వైద్యులతో మధ్యాహ్నం 2 గంటలకే పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయ్యే వరకూ మార్చురీ వద్దే ఉన్న జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పనితీరుకు అభినందనలు లభించాయి. 19 మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు ఒక్కో అంబులెన్స్‌లో ఒక్కో అధికారి చొప్పున అధికారులను గ్రామాలకు పంపి ప్రశంసలందుకున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 03:03 AM