Share News

Cold Storage Facilities: తెలంగాణలో 116 కోల్డ్‌ స్టోరేజీలు

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:34 AM

తెలంగాణలో ఇప్పటివరకు 116 కోల్డ్‌ స్టోరేజీలు 6.17 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం అందుబాటులో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది...

Cold Storage Facilities: తెలంగాణలో 116 కోల్డ్‌ స్టోరేజీలు

  • ‘పెద్దపల్లి’కి ఏకలవ్య పాఠశాల లేనట్టే..!

  • పార్లమెంట్‌లో కేంద్రం సమాధానాలు..

న్యూఢిల్లీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇప్పటివరకు 116 కోల్డ్‌ స్టోరేజీలు (6.17 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం) అందుబాటులో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. గురువారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఆర్‌.రఘురాంరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ సమాధానమిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటుపై ఎంపీ వంశీ కృష్ణ ప్రశ్నించారు. దీనికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్‌ ఉయికే సమాధానమిస్తూ.. ఈ జిల్లాల్లోని ఏ బ్లాక్‌లోనూ 50 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా లేదని, అలాగే కనీసం 20 వేల మంది గిరిజనులు కూడా లేకపోవడంతో ఏకలవ్య పాఠశాలలేవీ మంజూరు కాలేదని మంత్రి స్పష్టం చేశారు. ఇటు విద్యుత్తు రంగంలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్సీ)లో పదోన్నతుల విధానం, బాస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నియామకంలో ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ కేంద్ర విద్యుత్తు శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌.. ఎంపీ మల్లు రవి ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ పునరుద్ధరణకు రూ.14 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, కమిషనర్‌ బీనా మహాదేవన్‌లను ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు వారిని కలిసి వినతిపత్రాలు అందజేశారు.

ఓబీసీలకు పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి: కృష్ణయ్య

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఓబీసీ విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లభించడం లేదని, దీనివల్ల మెరికల్లాంటి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని రాజ్యసభలో బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యాసంస్థల్లోని ఓబీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పించాలని కోరారు. ఓబీసీలతో పోల్చితే ఈడబ్ల్యూఎస్‌, ఇతర రిజర్వుడ్‌ క్యాటగిరీల విద్యార్థులకు మాత్రం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతోందన్నారు. హాథీరామ్‌ బావాజీ మఠానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ కోరారు. పార్లమెంటులోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయనతో ఎంపీలు ఈటల రాజేందర్‌, గొడం నగేశ్‌తో కలిసి సీతారాం నాయక్‌ భేటీ అయ్యారు.


పాలపిట్టల సంరక్షణకు చర్యలు తీసుకోండి: లక్ష్మణ్‌

పాలపిట్టల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ కోరారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. పాల పిట్టల సంఖ్య సుమారు 30 శాతం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలపిట్టకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా సాంస్కృతిక ప్రాధాన్యం ఉందని తెలిపారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పలు రోడ్ల విస్తరణ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల నిసరన..

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పార్లమెంట్‌ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన తెలిపారు. గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బలరాం నాయక్‌, రఘురాంరెడ్డి, సురేశ్‌ షెట్కార్‌ ప్లకార్డులు చేతబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - Dec 19 , 2025 | 04:34 AM