Share News

Naxal Surrender: 37 మంది నక్సల్స్‌ లొంగుబాటు

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:28 AM

వరుస లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో కకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు...

 Naxal Surrender: 37 మంది నక్సల్స్‌ లొంగుబాటు

  • వీరిలో 25 మంది మహిళలు

  • ఆజాద్‌ సహా ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులూ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట సరెండర్‌

  • ఆయుధాలతో లొంగిపోయిన ఖమ్మం కమిటీ

  • సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుతో లొంగుబాట్లు

  • అందరికీ కలిపి 1.41 కోట్ల రివార్డు అందజేత

  • లొంగిపోయిన వారికి పునరావాసం, భద్రత

  • మిగిలిన వారూ జనజీవన స్రవంతిలో కలవాలి

  • మావోయిస్టులకు డీజీపీ పిలుపు

  • నేడో, రేపో అగ్రనేతల లొంగుబాటు?

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): వరుస లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో కకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌, అప్పాసి నారాయణ అలియాస్‌ రమేశ్‌, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముచ్చకి సోమడా అలియాస్‌ ఎర్రా సహా 37 మంది శనివారం డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో 25 మంది మహిళలు ఉన్నారు. వారు పెద్దసంఖ్యలో ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో ఒక ఏకే 47, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ లు, నాలుగు పాయింట్‌ 303 తుపాకులు, ఒక జీ3 తుపాకీతోపాటు 346 తూటాలను పోలీసులకు స్వాధీనం చేశారు. కాగా, లొంగిపో యిన వారిలో ఏడుగురు ఖమ్మం డివిజనల్‌ కమిటీ సభ్యులు ఉన్నారు. ఖమ్మం డివిజనల్‌ ఏరియా కమి టీ సభ్యుడు నూపో గంగా అలియాస్‌ నీలేశ్‌, మడవి సుక్కా, కర్టం మోటు, ఉయుకే బిచ్చే, పూనెం ఉంగి, అబ్కా రైమోతి, కుడియం దేవే పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరితోపాటు భద్రాద్రి కొత్తగూడెం డివిజనల్‌ కమిటీ సభ్యుడు సోడి సుక్కి, సోడి పైకీ, సోడి హిడ్మా కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఇక ఇటీవల ఏపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మాడ్వి హిడ్మా ఆధ్వర్యంలో పనిచేసిన పీఎల్‌జీఏ బెటాలియన్‌-1 ప్లాటూన్‌-బి కమాండర్‌ మాడ్వి కోసా, సెక్షన్‌-బి కమాండర్‌ నుపో సుక్కి కూడా లొంగిపోయారు. సౌత్‌ బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమడా తన దళంలోని ఇద్దరు డివిజనల్‌ కమాండ ర్లు, ఏడుగురు ఏరియా కమిటీ సభ్యులు, 13 మంది సభ్యులతో కలిసి లొంగిపోయారు. కాగా, ఆజాద్‌, అప్పాసి నారాయణ, సోమడా పేరిట ఒక్కొక్కరిపై రూ.20లక్షల చొప్పున రివార్డు ఉంది. వీరికి ఈ మొత్తంతోపాటు డివిజనల్‌ కమిటీ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, పార్టీ సభ్యులకు రూ.లక్ష చొప్పున, మిగిలిన వారికి రూ.25 వేల చొప్పున అందజేస్తున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రూ.1.41 కోట్లను డీడీ రూపంలో అందజేశారు.


మూడు డివిజనల్‌ కమిటీలు ఖాళీ..

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. తాజా లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఖమ్మం డివిజనల్‌ కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం కమి టీ, సౌత్‌ బస్తర్‌ డివిజనల్‌ కమిటీలు ఖాళీ అయినట్లేనన్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో మిగిలిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి, రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, గణేశ్‌, బడే చొక్కారావు, పవనానంద రెడ్డి, జోడే రత్నాబాయి, లోకేశ్‌ చందర్‌, శేఖర్‌, ముప్పిడి సాంబయ్య, మేకల మనోజ్‌, కర్రా వెంకటరెడ్డి, గంగిడి సత్యనారాయణ రెడ్డి కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. వారి భద్రతకు పూర్తి హామీ ఇస్తున్నామన్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం, స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 465 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఇంకా రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్న 59 మంది కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన 8 మందిలో ఐదుగురు తెలంగాణవారే ఉన్నారని తెలిపారు. వీరిలో ఒకరు తీవ్ర అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందన్నారు.


సిద్ధాంతపరమైన విభేదాల వల్లే..

మావోయిస్టు పార్టీ సాయుధ దళాల నాయకులు, సభ్యుల సంఖ్య రోజు రోజుకూ క్షీణిస్తోందని డీజీపీ అన్నారు. భద్రతా దళాల నిరంతర ఒత్తిడి వల్ల పార్టీకి చెందిన కీలక నెట్‌వర్క్‌లు నిర్వీర్యమయ్యాయని, ప్రజల నుంచి మద్దతు కరవైన క్రమంలో వారి ముందు లొంగుబాటు అవకాశం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా సిద్ధాంతపరమైన విభేదాలు రావడంతో భవిష్యత్తు కార్యాచరణపై నాయకత్వ స్థాయి క్యాడర్లలో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందన్నారు. సిద్ధాంతపరమైన భావజాలం, క్షేత్ర స్థాయిలో వాస్తవాల మధ్య ఏర్పడిన అంతరం వల్ల దశాబ్దాలుగా పార్టీలో ఉన్న సీనియర్‌ సభ్యులు తీవ్ర నిరాశకు గురవుతున్నట్లు అర్థమవుతోందన్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌ వెనుక తెలంగాణ ఎస్‌ఐబీ పాత్ర ఉంద న్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కాగా, పార్టీ అగ్రనేతల్లో కొంద రు లొంగిపోయేందుకు వివిధ మార్గాల ద్వారా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

అంతా పిన్న వయస్కులే

లొంగిపోయిన 37 మంది నక్సల్స్‌లో 25 మంది మహిళలే ఉండగా, వీరిలో 22 మంది 20-25 ఏళ ్లలోపువారే. వీరిలో చాలా మంది మావోయిస్టు పార్టీలో సప్లయ్‌, ప్రొటెక్షన్‌, గార్డు, టైలరింగ్‌ విధులు నిర్వహించారు. వీరిలో కొంతమందితో మాట్లాడినపుడు.. వచ్చీరాని తెలుగులో మాట్లాడారు. పార్టీ చెప్పిన పనిని తాము చేశామని, ఇప్పుడు భద్రతే ప్రశ్నార్థకంగా మారడంతో జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చామని చెప్పారు. ఈ ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఏమి చర్యలు తీసుకుంటారని ఎస్‌ఐబీ ఐజీ సుమతిని ప్రశ్నించగా.. ప్రతి అమ్మాయి బాధ్యతనూ తాము తీసుకుంటామని చెప్పారు.

మా మధ్య విభేదాల్లేవు: ఆజాద్‌

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తమ మధ్య విభేదాలు లేవని లొంగిపోయిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్‌ అన్నారు. పార్టీకి చెప్పే లొంగిపోవడానికి వచ్చామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవడమే మంచిదని, మిగతా వారు కూడా బయటకు రావాలని కోరారు. కాగా, మారుతున్న పరిస్థితులు, పనిచేయలేని నిర్బంధం, అడుగడుగునా పోలీసు క్యాంపుల మధ్య పార్టీ కోసం పనిచేయలేని పరిస్థితి ఏర్పడిందని మరో రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమడా అన్నారు. అందుకే లొంగిపోతున్నట్లు చెప్పారు.


ఆయుధాలతో లొంగిపోతే డబుల్‌ బొనాంజా

మావోయిస్టులు తమ ఆయుధంతో సహా లొంగిపోతే వారికి డబుల్‌ బొనాంజా ఆఫర్‌ను పోలీసులు ఇస్తున్నారు. వారిపై ఉన్న రివార్డుతోపాటు ఆయుధానికో రేటును ఖరారు చేశారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగణంగా మావోయిస్టులు స్వాధీనం చేసిన ప్రతి ఆయుధానికీ ఒక ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఏకే 47 రైఫిల్‌కు రూ.4 లక్షలు, ఎస్‌ఎల్‌ఆర్‌కు రూ.2 లక్షలు, 303 రైఫిల్‌కు రూ.లక్ష ఇస్తున్నారు. శనివారం లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలకుగాను వారికి ఇచ్చే రివార్డుకు అదనంగా రూ.13 లక్షలను డీజీపీ అందజేశారు.

హన్మకొండ జిల్లాలో హిడ్మా ఫ్లెక్సీ కలకలం

వేలేరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు జోహార్లు తెలుపుతూ హన్మకొండ జిల్లా వేలేరు మండలం సోడా్‌షపల్లి గ్రామంలో ఓ ఫ్లెక్సీ వెలిసింది. గ్రామానికి చెందిన కొయ్యడ సురేశ్‌, మ్యాక బుచ్చయ్య హిడ్మా మృతిపై సంతాపం తెలుపుతూ గ్రామ కూడలిలోని ఓ గోడకు హిడ్మా ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన పోలీసులు సురేశ్‌, బుచ్చయ్యను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అజ్మీర సురేశ్‌ తెలిపారు.

Updated Date - Nov 23 , 2025 | 05:32 AM