Share News

Uday Nagaraj: బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో తెలంగాణ బిడ్డ

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:29 AM

తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఏకంగా బ్రిటన్‌ పార్లమెంటులోని ప్రభువుల సభలో అడుగుపెట్టారాయన....

Uday Nagaraj: బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో తెలంగాణ బిడ్డ

  • నామినేట్‌ అయిన ఉదయ్‌ నాగరాజ్‌ .. ఈ సభకు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి..స్వస్థలం సిద్దిపేట జిల్లా శనిగరం

  • కంప్యూటర్‌ సైన్స్‌, పాలనాశాస్త్రంలో మాస్టర్స్‌

  • మనిషి నియంత్రణలోనే ఏఐ.. ఆ దిశగా కృషి

  • ‘ఆంధ్రజ్యోతి’కి ఉదయ్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ

హైదరాబాద్‌, డిసెంబరు 11, (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఏకంగా బ్రిటన్‌ పార్లమెంటులోని ప్రభువుల సభలో అడుగుపెట్టారాయన. వరంగల్‌, హైదరాబాద్‌, రామ్‌టెక్‌లలో చదువుకుని.. బ్రిటన్‌ లో ఉన్నత చదువులు చదివి, అక్కడ రాజకీయ ఔత్సాహికులకు ఒక సంస్థ పెట్టి శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ తీసుకున్నవారిలో కొందరు మేయర్లు, ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈయన కొన్నేళ్ల క్రితం బ్రిటన్‌ దిగువసభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు పోటీచేసినా కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. పాలనారంగం, ఇతర రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ను హౌస్‌ఆఫ్‌ లార్డ్స్‌కు ఎంపికచేశారు. బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సిఫారసుతో ఆ దేశ రాజు చార్లెస్‌ ఆయన్ను ఈ సభకు నామినేట్‌ చేశారు. ఈ సభకు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. ఆయనే ఉదయ్‌ నాగరాజ్‌. ఆ సభకు ఎంపీగా నామినేట్‌ అయిన సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి గురువారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అభినందనలు. ఇక్కడినుంచి ఇంగ్లండ్‌ వరకు ప్రస్థానం ఎలా?

మాది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇప్పటి సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం శనిగరం గ్రామం. నేను వరంగల్‌లో పుట్టాను. అక్కడ ఏడో తరగతి వరకు చదువుకున్నాను. హైదరాబాద్‌లో ఇంటర్‌వరకు చదివాను. మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాక ఇంగ్లండ్‌ వెళ్లాను. అక్కడ కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశాను.

కంప్యూటర్‌ సైన్స్‌ నుంచి రాజకీయాల వైపు ఎలా వచ్చారు?

నాకు తొలినుంచి సమాజం-సమాజంలో ఉండే వివిధ వర్గాల పట్ల అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉండేది. అసలు సమాజం ఏయే అంశాలపై ఎలా స్పందిస్తుంది? సమాజ గమనం ఎలా ఉంటుందన్నది? అనే వాటిపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. తెలంగాణ నుంచి అనేక దేశాల వరకు ఈ సమాజం-జాతుల గమనం అన్న అంశంపై అధ్యయనం చేశాను. ఈ ఆసక్తితోనే పాలనా శాస్త్రంలో కూడా మాస్టర్స్‌ చేశా. యూకే లేబర్‌ పార్టీలోని తెలుగు కమ్యూనిటీ కోసం మహాత్మాగాంధీ ఫ్యూచర్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించాను. అది ఒకరకంగా రాజకీయ నాయకత్వ కోర్స్‌. దానిద్వారా రాజకీయాల్లోకి రావాలనుకునే ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చాను. అలా శిక్షణ పొందినవారిలో కొందరు మేయర్లు, మరికొందరు ఇతర పదవులకు ఎంపికయ్యారు.


ఏడాదిక్రితం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. తొలిసారి ఓటమిని ఎలా తీసుకున్నారు?

నార్త్‌బెడ్‌ ఫోర్డ్‌షైర్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఏడాది పోటీ చేశాను. స్వల్ప తేడాతో ఓడిపోయాను. మెత్తగా ఉంటావు. రాజకీయాల్లోకి పనికిరావు అని కూడా కొందరన్నారు. ఆ సమయంలో కొంత బాధ అనిపించింది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అందరికీ దగ్గరయ్యాను. తొలినుంచీ సమాజాభివృద్ధి, దానికి సంబంధించిన విధానాలు, దాని గమనంపై ఆసక్తిగా ఉండే నేను ఆ ఓటమిని కూడా తీసుకోగలిగాను.

హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌కు మీ ఎంపిక ఎలా జరిగింది? పదవీకాలం ఎంత?

లేబర్‌ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు గతం నుంచీ చేస్తూ ఉన్నాను. ఇండియన్‌ కమ్యూనిటీ లేబర్‌ పార్టీకి మధ్య సమన్వయం చేసేవాడిని. విధానపరమైన అంశాల్లో నిపుణులతో చర్చలు నిర్వహించేవాడిని. లేబర్‌పార్టీ విధానాల రూపకల్పన కోసం పనిచేసేవాడిని. లేబర్‌ పార్టీ ఎంపీలకు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాను. ఇటీవల హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో కొన్ని స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాల్లో కూడా వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని ఎంపికచేయాలన్నారు. బ్రిటిష్‌ ప్రధానిగా ఉన్న కీర్‌ స్మార్టర్‌ ఈ పదవికి సిఫారసు చేశారు. కింగ్‌ ఆ సిఫారసును అంగీకరించి నియమించారు. హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ అంటే మన దగ్గర రాజ్యసభ మాదిరి. అయితే పదవీకాలం మాత్రం ఇక్కడిలా ఆరేళ్లు కాదు. జీవితకాలం. లైఫ్‌టైమ్‌ పదవీకాలం ఉంటుంది. రిటైర్‌మెంట్‌ అనేది కూడా ఉండదు.


మీ భవిష్యత్తు లక్ష్యాలేమిటి? ఏ అంశాలపై పనిచేయాలని అనుకుంటున్నారు?

ఈ పదవిని విజయంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నా. ఏఐ, మానసిక ఆరోగ్యం ఈ రెండింటిపైనా అంతర్జాతీయ స్థాయి నిపుణులతో సమావేశాలు, చర్చాగోష్టులు పెట్టి సమాజానికి అవసరమైన విధానాలు ఎలా ఉండాలో మార్గనిర్దేశం చేయాలని అనుకుంటున్నా. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు అందరి జీవితాల్లోకి వచ్చేస్తోంది. భ విష్యత్తు అంతా ఆ రంగానిదే. అయితే దాన్ని మనిషి నియంత్రించాలి కానీ...మనిషినే అది నియంత్రించే స్థితిలో ఉండకూడదు. ఏఐలో ఉండే లబ్ధి, సమర్థత, పనిలో వేగం ఇలాంటివాటివన్నీ తీసుకోవాలి. అదే సమయంలో మానవ ఉద్యోగాలు పోకుండా, ఇంకా ఎథిక్స్‌ కూడా ఉండేలా దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ దిశగా పనిచేస్తా. ఏఐలో అత్యున్నత నిపుణులతో కలిసి పనిచేసేందుకు ఈ స్థాయి నాకు ఉపకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజానికి ఉపయోగపడే ఏఐ మీద పనిచేస్తా. బ్రిటన్‌ ప్రధాని కూడా ఈ అంశంపై చాలా ఆసక్తిగా ఉన్నారు. మరో అంశం.. మానసిక ఆరోగ్యం! ఇప్పుడున్న ఒత్తిడులు, మితిమీరి సోషల్‌ మీడియా చూడటం.. వీటన్నింటితో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. దీనిపై ఏం చేస్తే బాగుంటుంది? అన్నదానిపైనా అధ్యయనం చేస్తా. అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగాల నిపుణులతో కలిసి మానవాళికి ఉపయోగకరమైన పద్ధతిపై ఒక అభిప్రాయాన్ని రూపొందిస్తా.

భారత్‌నుంచి బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు, ఉద్యోగార్దులకు మీ సలహా?

కష్టపడి పనిచేయండి. భవిష్యత్తు కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు.. మీరు ఇక్కడితో సహా ఏ దేశానికైనా వెళ్లేముందు అక్కడి విషయాలను పూర్తిగా అధ్యయనం చేయండి. సరైన సమాచారంతోనే వెళ్లండి.

Updated Date - Dec 12 , 2025 | 04:29 AM