Polavaram Project: తెలంగాణ నీటి హక్కులను కాపాడండి
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:49 AM
నదీ జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును విస్తరిస్తోందని ఆరోపించింది....
‘పోలవరం-నల్లమలసాగర్’ను అడ్డుకోండి
నిబంధనలకు విరుద్ధంగా విస్తరణ
డీపీఆర్ తయారీపై తక్షణం స్టే ఇవ్వండి
సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కారు
హైదరాబాద్/న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నదీ జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును విస్తరిస్తోందని ఆరోపించింది. ఇందులో భాగంగా చేపట్టిన ‘పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు’ను తక్షణమే అడ్డుకోవాలని కోరింది. ఈ మేరకు 251 పేజీలతో సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తరఫున న్యాయవాది సుమంత్ నూకల పేరిట మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని 32వ అధికరణం ప్రకారం తెలంగాణకు నీటి హక్కుల్లో రక్షణ కల్పించాలని కోరింది. ఈ కేసులో కేంద్ర జలశక్తి, ఆర్థిక, అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శులతో పాటు గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖను ప్రతివాదులుగా చేర్చింది. గోదావరి ట్రైబ్యునల్, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014ను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్ పనులు చేపట్టాలని నిర్ణయించిందని రిట్ పిటిషన్‌లో గుర్తు చేసింది. ఈ కేసులో తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
పోలవరం-బనకచర్ల అనుసంధానం కోసం 2024లో ఏపీ ప్రభుత్వం కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసినట్లు తెలంగాణ సర్కారు తెలిపింది. 2025 మేలో కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్)ను అందించగా.. దీనికన్నా ముందే పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసిందని గుర్తుచేసింది. అయితే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిపుణుల మదింపు కమిటీ ఈ ప్రాజెక్టును తిరస్కరించిందని పేర్కొంది. తొలుత పోలవరం-బనకచర్ల, ఇప్పుడు పోలవరం-నల్లమలసాగర్‌ను ప్రతిపాదించారని నివేదించింది. తొలిదశలో 33 వేల క్యూసెక్కులు కుడి ప్రధాన కాలువ(ఆర్‌ఎంసీ) ద్వారా రోజూ తరలించేలా పనులు చేపడుతున్నారని, దీనికోసం డీపీఆర్ సిద్ధం చేసేలా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్ పిలిచారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంది. పలుమార్లు ఈ అంశంపై కేంద్రానికి నివేదించినప్పటికీ ఫలితం లేకపోయిందని.. గత్యంతరం లేకనే రిట్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని తెలిపింది. నీటిపై అదనంగా హక్కులు పొందేందుకే ఏపీ ఈ ప్రాజెక్టులను చేపడుతోందని నివేదించింది. ప్రస్తుతం వానాకాలంలో 15 రోజులు మాత్ర మే ఉండే ముప్పు.. పోలవరం విస్తరణ పనులతో 100 రోజులకు పెరగనుందని గుర్తుచేసింది. పోలవరంలో నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో 55 కిలోమీటర్ల మేర నది గర్భంలో నీరుండే అవకాశం ఉంటుందని, అదే జరిగితే 36 ఉప నదుల ప్రవాహం సజావుగా గోదావరిలో కలిసే వీల్లేకపోవడంతో పాటు ముంపు ప్రమాదం ఉందని తెలిపింది. భ ద్రాద్రి ఆలయం, మణుగూరు భారజల కేంద్రానికి ముప్పు ఉందని.. అంతేగాక గోదావరి నుంచి కృష్ణాలో నీటిని పోసి, అక్కడి నుంచి తరలించడం వల్ల తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు వస్తాయని తెలిపింది. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తక్షణమే ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని, ఈ విషయంలో ఎటువంటి సహాయం అందించవద్దంటూ కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.