Share News

J Mohan Naik: తెలంగాణకే దక్కిన ఐఆర్‌సీ అధ్యక్ష పదవి

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:58 AM

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఐఆర్‌సీ కౌన్సిల్‌ అధ్యక్ష పదవి తెలంగాణకే దక్కింది.....

J Mohan Naik: తెలంగాణకే దక్కిన ఐఆర్‌సీ అధ్యక్ష పదవి

  • అధ్యక్షుడిగా ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీ మోహన్‌ నాయక్‌

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) కౌన్సిల్‌ అధ్యక్ష పదవి తెలంగాణకే దక్కింది. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ జే.మోహన్‌నాయక్‌ ఐఆర్‌సీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఈ నెల 5 నుంచి 10 వరకు 84వ ఐఆర్‌సీ సదస్సు జరగ్గా.. సోమవారం ముగింపు సదస్సులో మోహన్‌ నాయక్‌ను అధ్యక్షుడిగా కౌన్సిల్‌ ప్రకటించింది. అనంతరం కౌన్సిల్‌ సభ్యులు నాయక్‌కు శాలువా కప్పి సన్మానించి, బాధ్యతలు అప్పగించారు. కాగా, ఈ పదవి తెలుగు రాష్ట్రాలకు దక్కడం ఇదే మొదటిసారి. రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల భద్రత తదితర అంశాలపై ఐఆర్‌సీ కీలకంగా వ్యవహరిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో రోడ్ల భద్రత, నిర్మాణాల్లో కొత్త పద్ధతులపై నిర్వహించే, అప్పటికే చేసిన పరిశోధనలకు సంబంధించిన అనుమతులతో పాటు ఆమోదం కూడా ఐఆర్‌సీనే ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు-రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్‌) పరిధిలోని అదనపు డైరక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) ఐఆర్‌సీ కౌన్సిల్‌కు అధికారిగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల తరపునుంచి ఆయా రాష్ట్రాలు ప్రతిపాదించిన వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఒక అధ్యక్షడు, ప్రధాన కార్యదర్శి, 3-4 ఉపాధ్యక్షులు, మొత్తం 100 మంది సభ్యులతో ఐఆర్‌సీ ఉంది.

రహదారుల భద్రతకు పెద్దపీట వేస్తాం: మోహన్‌నాయక్‌

ఈ పదవితో తనకు మరింత బాధ్యత పెరిగిందని, రహదారుల భద్రత, కొత్త నిర్మాణ పద్ధతులపై ప్రధానంగా దృష్టి సారిస్తామని, రహదారుల భద్రతకు పెద్దపీట వేస్తామని మోహన్‌నాయక్‌ అన్నారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. వచ్చే ఏడాది తెలంగాణలో నిర్వహించే 85వ ఐఆర్‌సీ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని, కేంద్రం నుంచి మరిన్ని కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 02:58 AM