Ministers Raise Concerns: పంటల కొనుగోళ్లకు కేంద్రం కొర్రీలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:28 AM
కనీస మద్దతు ధరపై 25ు పంట కొనుగోళ్లకు కేంద్రం నిబంధనలతో అన్నదాతలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని రాష్ట్ర వ్యవసాయ....
పత్తి రైతుకు భారంగా కేంద్రం రూల్స్
25 శాతం కొనుగోళ్లకు ఇన్ని నిబంధనలా: మంత్రి తుమ్మల
దళారులకు అమ్ముకోవద్దు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్/ న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కనీస మద్దతు ధరపై 25ు పంట కొనుగోళ్లకు కేంద్రం నిబంధనలతో అన్నదాతలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సమస్యలు, జిన్నింగ్ మిల్లుల సమ్మె నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిపై కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి, రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుమ్మల మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరపై 25ు పంట కొనుగోళ్ల నిబంధనను ఎత్తివేయాలని పలుమార్లు కోరినా పత్తి కొనుగోళ్లపై కఠిన నిబంధనలను అమలు చేయడం ఆందోళనకరమన్నారు. జిల్లాల వారీగా పత్తి దిగుబడి వివరాలను పంపినా తొలుత ఎకరాకు 11 క్వింటాళ్లు.. తర్వాత 7 క్వింటాళ్లకు పరిమితి విధించడం రైతులను అయోమయానికి గురి చేసిందన్నారు. తేమ శాతం సడలించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని ఆయన చెప్పారు. కేంద్రం తెచ్చిన ఎల్-1, ఎల్-2 విభజన నిబంధనలతో ఎక్కువ జిన్నింగ్ మిల్లులు తెరవలేదన్న తుమ్మల.. ఇప్పటి వరకు కేవలం 243 మిల్లులే రైతులకు కేటాయించడం పెద్ద సమస్యగా మారిందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని జిన్నింగ్ మిల్లుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లపై ఆందోళన చెందొద్దని రైతులను కోరారు. మార్చి వరకూ కొనుగోళ్లు సాగుతాయని, తేమశాతం ఎక్కువగా ఉంటే ఎండబెట్టి మిల్లులకు తీసుకెళ్లాలే తప్ప.. తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దన్నారు. రాష్ట్రంలో 200కి పైగా కేంద్రాల్లో పత్తి కొనుగోలు జరుగుతుందన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు జిన్నింగ్ మిల్లుల సంఘం సమ్మెను విరమించేందుకు అంగీకరించిందని తెలిపారు.