Ponnam Satayya: భూమి పుత్రుడికి ఘన నివాళి
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:43 AM
భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసి తమ పిల్లల్ని ప్రయోజకులను చేసిన భూమిపుత్రుడు పొన్నం సత్తయ్య అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
భూమిని నమ్ముకున్న గొప్ప వ్యక్తి పొన్నం సత్తయ్య: తుమ్మల
సత్తయ్య ఈ తరానికి ఆదర్శమూర్తి: మంత్రి జూపల్లి
నవీన్ ఇంట్లో నేనే పాలు పోసే వాడిని: మంత్రి పొన్నం
రవీంద్రభారతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసి తమ పిల్లల్ని ప్రయోజకులను చేసిన భూమిపుత్రుడు పొన్నం సత్తయ్య అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రవీంద్రభారతిలో తెలంగాణభాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ 15వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య జీవనసాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, జానపద గాయని అంతడుపుల రమాదేవిలకు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరై ముందుగా పొన్నం సత్తయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం పురస్కారగ్రహీతలను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పొన్నం సత్తయ్య పేరు మీద కవులు, కళాకారులను సత్కరించడం అభినందనీయమన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పొన్నం సత్తయ్య ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి, ఈ తరానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తమది వ్యవసాయ కుటుంబమని, కరీంనగర్‌లో అంపశయ్య నవీన్ ఇంట్లో తానే స్వయంగా పాలు పోసే వాడినని గుర్తుచేసుకున్నారు. గతేడాది బలగం కొమురయ్యకు పురస్కారం ప్రదానం చేశామని, ఇచ్చిన మాట ప్రకారం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సత్తయ్యతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి శ్రీధర్‌బాబు పంచుకున్నారు.