Komatireddy Venkat Reddy: పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:47 AM
పవన్‌కల్యాణ్.. తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు! క్షమాపణలు చెబితే నీ సినిమాలు నైజాంలో రెండు రోజులైనా ఆడుతయి. క్షమాపణలు చెప్పనిపక్షంలో...
సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా!.. లేదంటే ఇక్కడ నీ సినిమాలు ఆడవు: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘పవన్‌కల్యాణ్.. తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు! క్షమాపణలు చెబితే నీ సినిమాలు నైజాంలో రెండు రోజులైనా ఆడుతయి. క్షమాపణలు చెప్పనిపక్షంలో ఇక్కడ నీ సినిమాలు నడవవు. ఇది నేను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా!’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గాంధీభవన్‌లో మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తాము 60 ఏళ్ల పాటు బాధలు పడ్డామని, ఫ్లోరైడ్ నీళ్లు తాగి బతికామని, వాళ్లు తెలంగాణ నిధులు, నీళ్లు, ఉద్యోగాలనూ తీసుకెళ్లారన్నారు. హైదరాబాద్ ఆదాయంతో విజయవాడ, వైజాగ్ సహా సీమాంధ్రలోని మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటై దాదాపు 13 ఏళ్లయిన తర్వాతా పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా అని నిలదీశారు. ఆయన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఉంటారని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికావని అన్నారు. పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి మంచి వ్యక్తి అని, ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నడూ చేయలేదని కితాబునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని, తాము ఆ అప్పులు కడుతూ ఇప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ సమాజాన్ని పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడటం మంచిదికాదన్నారు.
తలతిక్క మాటలు మానుకోవాలి: వాకిటి
తెలంగాణలోని వనరులను వాడుకుని ఈ స్థాయికి ఎదిగిన పవన్ కల్యాణ్.. తన తలతిక్క మాటలను మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని పేర్కొన్నారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తెలంగాణలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇది సినిమా కాదు: ఎంపీ చామల
స్ర్కిప్టు చదివి వెళ్లడానికి ఇది రెండున్నర గంటల సినిమా కాదని, ఒక చోటకి వెళ్లినప్పుడు అక్కడి సమస్యలపైన మాట్లాడాలని పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హితవు పలికారు. డిప్యూటీ సీఎం అన్న సంగతి మరిచిపోయి ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత కోనసీమకు దిష్టి తగిలినట్లుందని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.