Minister Tummala Nageswara Rao: అమెరికా పత్తి దిగుమతిపై సుంకం ఎత్తివేయటం అన్యాయం
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:45 AM
అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని ..
కేంద్రం నిర్ణయంతో పత్తి రైతులకు తీరని నష్టం
రైతు ప్రయోజనాల కోసం ఉద్యమం చేస్తాం: తుమ్మల
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మనదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుల్లో ఒకటైనప్పటికీ, అమెరికా ఒత్తిడికి లోనై పత్తి దిగుమతులపై అమలులో ఉన్న 11ు సుంకాన్ని ఎత్తివేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశీయ రైతులకు తీరని నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2025 ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 30 వరకు మాత్రమే అని ప్రకటించిన ఈ మినహాయింపును తాజాగా డిసెంబరు 31 వరకు పొడిగించడం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని మంగళవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా విధించిన 50ు దిగుమతి సుంకాల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కేంద్ర పభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా... టెక్స్‌టైల్ ఎగుమతిదారులకు చవక ముడి సరుకు సమకూర్చేందుకు దేశీయ పత్తి రైతులకు నష్టం చేయటం సరైన చర్య కాదన్నారు. ఈ నిర్ణయంతో రైతులకు, ప్రభుత్వానికి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు నష్టం జరుగుతుందని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో కలసి ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 10ు భూమిని సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని, కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాలపాటు రైతులకు ఆదాయ మద్దతు ఇవ్వాలని కోరారు. సేంద్రియ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, రైతులకు ఆదాయ మార్గం పెరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వ్యవసాయ మార్కెట్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి తుమ్మలకు.. రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం గౌరవాధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, ప్ర ధాన కార్యదర్శి బి.నర్సింలు యాదవ్‌లు విజ్ఞప్తి చేశా రు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస స ముదాయంలో మంత్రి కలిసి వినతిపత్రం అందజేశారు.
మార్క్‌ఫెడ్ కార్యాలయంతో తనిఖీ
మంత్రి తుమ్మల మంగళవారం నాంపల్లిలోని మార్క్‌ఫెడ్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి 10.40 మధ్య సమయంలో ఆయన కార్యాలయానికి వెళ్లగా.. అప్పటివరకు చాలామంది అధికారులు, ఉద్యోగులు రాలేదు. సమయానికి అధికారులు, సిబ్బంది అంతా కార్యాలయానికి చేరుకోవాలని మంత్రి సూచించారు.