Minister Tummala Nageswara Rao: హరీశ్ వ్యాఖ్యలు అసత్యాలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:26 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త డిస్కమ్ ఏర్పాటు అంశానికి సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు అసత్యాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు...
డిస్కమ్‌లను అప్పుల్లో ముంచింది బీఆర్‌ఎస్సే
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త డిస్కమ్ ఏర్పాటు అంశానికి సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు అసత్యాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని నట్టేట ముంచిన బీఆర్‌ఎస్ దొంగలకు ప్రజలు ఎన్నికల్లో బుద్థి చెప్పారని, దాంతో మైండ్ దెబ్బతిని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్‌లో పరిశ్రమల భూములను కన్వర్షన్‌కు ప్రభుత్వం జీవో ఇవ్వకముందే రూ.5 లక్షల కోట్ల కుంభకోణం అంటూ కేటీఆర్ ప్రభుత్వంపై ఆరోపణల చేశారని తుమ్మల పేర్కొన్నారు. ఇప్పుడు బావమరిది(కేటీఆర్) కంటే తానేం తక్కువ కాదన్నట్టు బావ(హరీశ్) రూ.50వేల కోట్ల కుంభకోణం అని మరో అబద్దం ఎత్తుకున్నారని విమర్శించారు. ఏం మాట్లాడాలో తెలియక విద్యుత్ ప్లాంట్లలో అవినీతి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇష్టమొచ్చిన ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేసి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, తెలంగాణ డిస్కమ్‌లను రూ.90వేలకోట్ల అప్పుల్లో ముంచింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తుమ్మల స్పష్టం చేశారు. అవసరం లేకపోయినా ఛత్తీ్‌సగఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు పేరిట వేలకోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు. బొగ్గులేని దామరచర్లలో థర్మల్ పవర్‌ప్లాంట్ కట్టి ప్రజలకు భారం.. నాయకులకు లాభం అనే కుట్రను అమలు చేశారన్నారు. భద్రాద్రిలో కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించి జెన్‌కోను దెబ్బతీశారన్నారు. దామరచర్లలో తమ సొంత ప్లాంట్లకు లాభం చేకూర్చేందుకు ఎన్టీపీసీ ప్లాంట్ ఆలస్యానికి కారణమైనది బీఆర్‌ఎస్సేనని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఒప్పందం చేసుకుని ఉంటే ఇప్పుడు 2,400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుబాటులో ఉండేదని తుమ్మల వెల్లడించారు. యాదాద్రి- భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్‌తో న్యాయవిచారణ చేపట్టిందన్నారు. ఏ రోజైనా ఆ అవినీతి బయటపడుతుందన్న భయం బీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోందని, అందుకే ఏదో చెప్పి తప్పించుకునేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని తుమ్మల తెలిపారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో ఫెయిల్ అయిన కంపెనీకి నామినేషన్ పద్థతిలో కాంట్రాక్ట్ ఇచ్చి, యూనిట్ విద్యుత్ రేటును రూ.9వరకు పెంచారని, బొగ్గు, నీటి వనరుల్లేని ప్రాంతంలో యాదాద్రి ప్లాంట్ నిర్మించి భారీనష్టం కలిగించారని తుమ్మల పేర్కొన్నారు.