Share News

Minister Tummala Nageswara Rao: పత్తి కొనుగోలు బాధ్యత కేంద్రానిది కాదా?

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:55 AM

పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు అనేక షరతులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులను ఇబ్బంది పెడుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు....

Minister Tummala Nageswara Rao: పత్తి కొనుగోలు బాధ్యత కేంద్రానిది కాదా?

  • దేశంలో పండే మొత్తం పత్తినికొంటామని మోదీ అనలేదా?

  • కొత్తగా కిసాన్‌ కపాస్‌ యాప్‌,7క్వింటాళ్ల రూల్‌ ఎందుకు?

  • తేమ ఎక్కువున్న పత్తిని కొనాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరాం

  • స్పందన లేకపోవడంతో రైతులకు ఇబ్బంది

  • రాష్ట్ర రైతులను బీజేపీ ఇబ్బంది పెడుతోంది

  • బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనా కాలంలో అధోగతిలోకి తెలంగాణ రాష్ట్రం: తుమ్మల

  • ‘‘వాళ్లింట్లో అగ్గి అంటుకుందని అసత్య ప్రచారాలతో రాష్ట్రాన్ని కాల్చేస్తారా’’ అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యలు

హైదరాబాద్‌/ఖమ్మం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు అనేక షరతులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులను ఇబ్బంది పెడుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘పత్తి కొనుగోలు బాధ్యత కేంద్రానిది కాదా’’ అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దేశంలో పండే పత్తి మొత్తాన్ని కొంటామని ప్రధాని మోదీ గతంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడేమో కిసాన్‌ కపాస్‌ యాప్‌, పత్తి కొనుగోలుపై 7క్వింటాళ్ల పరిమితి, జిన్నింగ్‌ మిల్లుల విభజన... ఇలా ఒక్కో సమయానికి ఒక్కో నిబంధన పెడుతూ రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. పత్తి తేమపై దేశవ్యాప్తంగా ఒకే పాలసీ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వర్షాలు, మొంథా తుఫాను ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అయినా, కనీస స్పందన కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎకరానికి 5 క్వింటాళ్ల నుంచి 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంటే.. 7 క్వింటాళ్ల నిబంధన ఎందుకు పెట్టారని, అధికంగా పండించిన పత్తిని రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 కేటగిరీలుగా విభజించి.. కొన్నింటిలోనే కొనుగోలు చేస్తామని కొత్త నిబంధనలు పెట్టడంతో జిన్నింగ్‌ మిల్లుల యజమానులను గందరగోళంలో పడేశారని, రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని జిన్నింగ్‌ మిల్లుల సమ్మెను పరిష్కరించిందని, కనీసం వారి సమస్యలు అర్థం చేసుకోలేని పరిస్థితిలో కేంద్రం ఉందని తుమ్మల ఎద్దేవా చేశారు. సీజన్‌ ప్రారంభంలో మద్దతు ధర ప్రకటించి వదిలేయడమే తప్ప, రైతులకు మద్దతు ధర అందుతుందా? లేదా? అని కేంద్రం ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వమే పలు పంట ఉత్పత్తులను మద్దతు ధరకు సేకరిస్తున్నదని తుమ్మల తెలిపారు. ‘‘కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు వెచ్చించి మద్దతు ధరతో మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న విషయం మీకు తెలియదా.. నాఫెడ్‌ ద్వారా చేపడుతున్న సోయాబీన్‌ కొనుగోళ్లలో ఆధార్‌ ధృవీకరణతో కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నది మీరు కాదా’’ అని తుమ్మల రాష్ట్ర బీజేపీ నాయకులను నిలదేశారు.


బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలను ఇంకా మభ్యపెట్టలేరు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ఆ రెండు పార్టీలు రాజకీయ కుట్రలతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. ‘‘వాళ్ల ఇంట్లో అగ్గి అంటుకుందని, అసత్య ప్రచారాలతో రాష్ట్రాన్ని కాల్చేస్తారా’’ అని బీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి అన్నారు. పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు.. తమ వల్లే పత్తి కొనుగోళ్లు జరుగుతున్నట్లు చెప్పుకొంటున్నారని, వారిని చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల అవినీతి వల్లే వారు ఇప్పుడు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందని, ఇంకా ప్రజలను మభ్యపెట్టాలంటే కుదరదని, వారి చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియనిది కాదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు ముందుగా వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో మాట్లాడి పంటలను కనీస మద్దతు ధరకు కొనేలా చూడాలని సవాలు చేశారు.

Updated Date - Nov 20 , 2025 | 05:55 AM