Raviraj Master: వినూత్నంగా విద్యా బోధన
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:39 AM
విద్యార్థులు సులభంగానేకాకుండా ఆసక్తితో పాఠాలను నేర్చుకునేలా వినూత్నరీతిలో బోధిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న...
పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు
మెదక్ జిల్లా ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాల గణితం టీచర్ ప్రత్యేకత
ఆయన యూట్యూబ్ చానల్‌కు దేశ విదేశాల్లో విస్తృత ఆదరణ
ఇటీవలే ఉత్తమ టీచర్‌గా అవార్డు
నర్సాపూర్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సులభంగానేకాకుండా ఆసక్తితో పాఠాలను నేర్చుకునేలా వినూత్నరీతిలో బోధిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న గణితం మాస్టారు రవిరాజ్. పాఠాలను ఆటల మేళవింపుతో నేర్చుకునేందుకు వీలుగా బోర్డ్ గేమ్స్, పజిల్స్‌ను ఆయన ప్రవేశపెట్టారు. వీటితో విద్యార్థుల్లో పాఠాల పట్ల ఆసక్తి పెరుగుతూ సులభంగా నేర్చుకుంటున్నారు. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేందుకు దోహదపడే పరికరాలను ఆయన సొంత డబ్బుతో కొనుగోలు చేశారు. రవిరాజ్ వినూత్న బోధనకు ఆకర్షితులై ఆద్మాపూర్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది పాఠశాలలో 53 మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు 73కు చేరింది. ఇంతకు ముందు పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 45 శాతం ఉంటే.. రవి రాజ్ బోధన విధానంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి హాజరు శాతం ఏకంగా 95 శాతానికి ఎగబాకింది. ఆయన వినూత్న బోధనకు గుర్తింపుగా సెప్టెంబరు 5న రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. కాగా రవిరాజ్ ప్రారంభించిన యూట్యూబ్ చానల్ ఎల్లలుదాటుతోంది. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ‘రవిరాజ్ మాస్టర్’ పేరుతో ఆయన యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. విద్యార్థులు సులభంగా గణితం బేసిక్స్‌ను అర్థం చేసుకునేలా తనదైన శైలీలో వీడియోలను పోస్ట్ చేయడం మొదలెట్టారు. ఈ చానల్‌లో 1,600కు పైగా వీడియోలున్నాయి. ఇప్పుడు ఈ చానల్‌కు 2మిలియన్లకుపైగా సబ్‌స్ర్కైబర్లున్నారు. 20 కోట్లకు పైగా వ్యూస్ లభించాయి. ఆయన పాఠాలకు విద్యార్థుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
విద్యార్థుల్లో ఆసక్తి పెరగాలనే..
విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలలో వినూత్న రీతిలో బోధన చేస్తున్నా. పాఠ్యాంశాల బోధనేకాకుండా అవసరమయ్యే పరికరాలు సొంత ఖర్చుతో కొని వాటిని ప్రత్యక్షంగా విద్యార్థులకు చూపుతున్నా. కొవిడ్ సమయంలో ఇంటి వద్దనే ఉన్న విద్యార్థులకు విద్యను అందించేందుకు యూట్యూబ్ చానల్ ప్రారంభించాను. ఇప్పుడు లక్షలాది మంది నా వీడియోలు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా వీడియోలను మానిటైజ్ చేసుకోలేదు. నా వీడియోలను సామాజిక సేవగానే తప్ప ఆదాయ వనరుగా చూడటం లేదు.
- రవిరాజ్, గణితం ఉపాధ్యాయుడు