Legislative Council: బీసీల బిల్లులకు మండలి ఆమోదం
ABN , Publish Date - Mar 19 , 2025 | 06:38 AM
విద్యా ఉపాధి రంగాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఆమోదింపజేయాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
కేంద్రం ఆమోదం అవసరమంటూ
మాయమాటలు చెప్పవద్దు: కవిత
హైదరాబాద్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): విద్యా ఉపాధి రంగాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సోమవారం శాసనసభలో ఈ రెండు బిల్లులకు ఆమోదం లభించిన అనంతరం మండలిలో ప్రవేశపెట్టగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 16 మంది సభ్యులు ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే నిబంధనను రాజ్యాంగ సవరణ 103 ప్రకారం ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం ఎత్తివేయడంతో... బీసీ రిజర్వేషన్లు 29 నుంచి 42 శాతానికి పెంచడానికి మార్గం సుగమమవుతుందని పొన్నం పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో 50 శాతం దాటి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తమిళనాడులో జయలలిత 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్లు తెలిపారు. కర్ణాటకలో 66 శాతం, లక్షద్వీ్‌పలో 100 శాతం ట్రైబల్ రిజర్వేషన్, రాజస్థాన్‌లో 64 శాతం, సిక్కింలో 80 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని పార్టీల నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని బీజేపీని ఒప్పించాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి ప్రజల ముందుంచాలని కోరారు.
అంతకుముందు బీఆర్‌ఎస్ సభ్యులు ఎల్.రమణ, కవిత, మధుసూదనాచారి తదితరులు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటించారు. కానీ బీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని విమర్శించారు. బీసీలను మభ్యపెట్టవద్దని, రాజకీయ రిజర్వేషన్లకు కేంద్ర ఆమోదం అవసరమనే మాయమాటలు చెప్పవద్దని కవిత పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి నుంచి బీసీలు అన్యాయానికి గురవుతున్నారని తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు విద్యా ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత పెరగాలని ఏవీఎన్ రెడ్డి (బీజేపీ) అన్నారు. అఫెండీ (మజ్లిస్) బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు పలికారు. రాజ్యాంగం ప్రకారం బీసీలు సమాన హక్కులు పొందడానికి రిజర్వేషన్లు అవ సరమని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. కులగణన సర్వేలో కురుమల సంఖ్యను తగ్గించారని యెగ్గె మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు.