Deputy CM Bhatti Vikramarka: బీసీ బిల్లుపై ప్రధానితో చర్చలకు సిద్ధం
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:01 AM
ప్రధాని మోదీ సమయం ఇస్తే బీసీ బిల్లుపై చర్చించేందుకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని ఎంపీలను కోరారు...
ఆయన సమయమిస్తే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్దాం
రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు ప్రధానిని కలిసి వినతిపత్రం ఇవ్వాలి
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖలు రాశాం
పార్లమెంటు సమావేశాల్లో ఆ అంశాలను ప్రస్తావించండి
నిర్ణీత ఫార్మాట్‌లో సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం
రాష్ట్ర ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పాల్గొన్న బీజేపీ ఎంపీలు.. బీఆర్‌ఎస్, మజ్లిస్ ఎంపీల గైర్హాజరు
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ సమయం ఇస్తే బీసీ బిల్లుపై చర్చించేందుకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని ఎంపీలను కోరారు. నిర్దేశిత ఫార్మాట్‌లో వాయిదా తీర్మానం ఇవ్వాలని లేదా ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు పెట్టాలని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలు ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన గురువారం రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్‌కుమార్ యాదవ్, బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, నగేష్ పాల్గొన్నారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలతోపాటు 12శాఖలకు సంబంధించిన 47అంశాలపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకతీతంగా ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పార్లమెంట్‌లో ఎంపీలు అడగాలనుకునే సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్‌లో ప్రశ్నించాలన్నా, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలన్నా...నిర్దేశిత ఫార్మాట్‌లో సమాచారాన్ని ఎంపీలకు అందిస్తామని వివరించారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై గతంలోనే కేంద్రానికి లేఖలు రాశామని గుర్తు చేశారు. ప్రత్యేక విభాగంలో ఆ లేఖలు అందుబాటులో ఉంటాయని, వాటి ఆధారంగా కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరిట విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. దేశ, విదేశాల్లోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కమిటీలు వేస్తున్నామని, ఆసక్తిగల వారు పేర్లు ఇస్తే కమిటీల్లో సభ్యులుగా వేస్తామన్నారు. ఎంపీలకు తెలిసిన ప్రముఖులు, దిగ్గజ సంస్థల వివరాలు ఇస్తే.. వారినీ సమ్మిట్‌కు ఆహ్వానిస్తామన్నారు.
కలిసికట్టుగా ముందుకెళ్దాం: రఘునందన్
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర సమస్యలపై ప్రధాని మోదీని సమష్టిగా కలుద్దామని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రతిపాదించారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎ్‌సల సమాచారాన్ని అందిస్తే సంబంధిత మంత్రిని కలిసి లేఖ ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనా ల విషయంలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాదామని చెప్పారు. బొగ్గు గనుల విషయంలో అందరం కలిసి ఆ మంత్రిని కలుద్దామన్నారు. దీనిపై నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి స్పందిస్తూ రఘునందన్ ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గవన్నారు. మహబూబ్‌నగర్ ఎయిర్‌పోర్టు కోసం కేంద్రానికి లేఖ రాయాలని, గద్వాల-డోర్నకల్ రైల్వే లైన్‌పైనా సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తన నియోజకవర్గంలో లక్ష మందిపై ముంపు ప్రభావం ఉంటుందని ఎంపీ బలరాం నాయక్ చెప్పారు. ములుగు-ఏటూరునాగారం రహదారి మంజూరైనా.. అటవీ, పర్యావరణ అనుమతులు రాకపోవడంతో టెండర్ ఖరారు కాలేదని, ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. ఉపాధి హామీ పథకం పనిదినాలు బాగా తగ్గుతున్నాయని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ చెప్పారు. జహీరాబాద్-బీదర్ రహదారి విషయమై కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి 800 ఎకరాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిందని, ఇప్పటికే అక్కడ 369 ఎకరాలు అందుబాటులో ఉందని, ఇదీ అందులో అంతర్భాగమా? లేక అదనంగా సేకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మొత్తం వెయ్యి ఎకరాలపైగా అవసరమని చెప్పారు. వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయమై కేంద్రానికి లేఖ రాయడంతోపాటు సమావేశాల్లో లేవనెత్తాలని కడియం కావ్య అభిప్రాయపడ్డారు.